గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన ఏది మాట్లాడినా సరే కాస్త మీడియా వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఆయన బీజేపీ లోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ లోకి వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా లేదా అనే అంశం పక్కన పెడితే ఆయనను బీజేపీ పెద్దలు ఆహ్వానిస్తున్న సరే ఆయన మాత్రం బీజేపీ లోకి వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన బీజేపీలోకి వెళితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చు అనే భావన ఉంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కాస్త తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాతో ఆయన ఎక్కువగా చర్చలు జరుపుతున్నారని సమాచారం. త్వరలోనే చంద్రబాబునాయుడుతో కూడా ఒకసారి సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది.
ఇక ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆయన చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే బీజేపీ ఇప్పుడు దీనిపై ఆగ్రహంగా ఉందని… అందుకే ఆయనపై సీబీఐ కేసులు నమోదయ్యాయని కొంతమంది అంటున్నారు. ఆయనను త్వరలో అరెస్టు చేసిన ఆశ్చర్యం లేదు అనేది మీడియా వర్గాల మాట.