బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఇన్నాళ్ళు పార్టీలో వారికి ప్రాధాన్యత లేకపోవడంతో..పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలో వారిని పార్టీ సస్పెండ్ చేసింది. అయితే ఈ సస్పెన్షన్..ఆ ఇద్దరు నేతలకు పెద్ద ఊరట అన్నట్లు ఉంది. అసలు పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం హ్యాపీగా ఉందని అంటున్నారు.
అదే సమయంలో పార్టీ సస్పెండ్ చేయడంతో..ఇంకా పార్టీకి చెక్ పెట్టేలా వారు ముందుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. బిఆర్ఎస్ లో పడిన అవమానాలకు రివెంజ్ తీర్చుకోవడానికి చూస్తున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ తీయాలని పొంగులేటి చూస్తున్నారు. గత ఎన్నికలలో ఖమ్మం జిల్లా నుంచి కేవలం ఒక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని..ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆ ఒక్క స్థానాన్ని కూడా గెలిచే అవకాశం లేదని పొంగులేటి తేల్చి చెప్పారు. 2023లో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఖమ్మం జిల్లాలో రాకుండా చేస్తానని ఆయన సవాల్ చేశారు.
ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని ఛాలెంజ్ చేశారు. ఆ దిశగానే పనిచేయడానికి పొంగులేటి రెడీ అవుతున్నారు. వాస్తవానికి ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీకి పట్టు లేదు. గత ఎన్నికల్లో 10 సీట్లకు ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అయితే ఇప్పుడుప్పుడే బిఆర్ఎస్ పార్టీ పట్టు పెరుగుతుంది. ఈలోపు బిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలని పొంగులేటి ఏకం చేసి..బిఆర్ఎస్ పార్టీకే చెక్ పెట్టేలా ముందుకెళుతున్నారు.
ఒకవేళ ఈయన ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో పొంగులేటి తన వర్గం నేతలతో ఇండిపెండెంట్ గా బరిలో దిగినా సరే ఓట్లు చీలిపోయి బిఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగేలా ఉంది. ఎటు తిప్పిన పొంగులేటి బిఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ తప్పదు.