పనితీరు బాగోకపోతే ఎలాంటి వారికైనా సీటు ఇవ్వనని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా గడపగడప సమీక్షా సమావేశంలో కూడా జగన్ అదే చెప్పారు. కొందరు ఎమ్మెల్యేల తీరు సరిగ్గా లేదని వారికి మళ్ళీ సీటు ఇస్తే పార్టీకే ఇబ్బంది అని అందుకే సీటు ఇవ్వడం కష్టమని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో పనితీరు బాగోని వారికి కొందరు మంత్రులు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. రాయలసీమలో ఒక మంత్రి, కోస్తాలో ఇద్దరు, ఉత్తరాంధ్రలో ఒక మంత్రి పనితీరు బాగోలేదని సర్వేలోతేలినట్లు తెలిసింది.
అయితే సీమలో పనితీరు బాగోని మంత్రి గుమ్మనూరు జయరాం అని ప్రచారం జరుగుతుంది. ఆయన పనితీరు సరిగ్గా లేదని, పైగా పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాల ఆరోపణలు వచ్చాయి. అలాగే ఆలూరు నియోజకవర్గంలో ఆయనపై ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆలూరులో ఊహించని చేరికలు జరిగాయి. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు కుమార్తె కప్పట్రాళ్ల బొజ్జమ్మ వైసీపీలో చేరారు.
కడపకు చెందిన వైసీపీ నేతలు..ఈమెని వైసీపీలోకి తీసుకొచ్చారు. ఎప్పటినుంచో ఈమె పార్టీలో చేరాలని చూస్తే జయరాం అడ్డుపడ్డారని తెలిసింది. చివరికి జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బొజ్జమ్మ వైసీపీలో చేరారు.
అయితే బొజ్జమ్మ టిడిపి నాయకురాలు..ఆమె ఫ్యామిలీ దశాబ్దాలుగా టిడిపిలో పనిచేస్తూ వస్తుంది. కానీ అక్కడ ఆమెకు సీటు లేదు. ఆలూరు సీటు కోట్ల సుజాతమ్మకు ఫిక్స్ అయింది. దీంతో బొజ్జమ్మ వైసీపీలోకి వచ్చారు. ఆలూరు సీటు హామీ రావడంతోనే ఆమె పార్టీ మారిపోయారని తెలిసింది. ఇటు జయరాంని ఎంపీగా పంపిస్తారని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి చివరికి ఆలూరు సీటు విషయంలో ఏం జరుగుతుందో.