రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, తీన్మార్ మల్లన్నలు తెలంగాణకు శనిలా మారారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కోతి, బండి సంజయ్ కొండముచ్చులాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు సొరంగం తవ్వుకుని పొత్తులు పెట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాడాలని హితవు పలికారు. లేకపోతే ప్రజలే మిమ్మల్ని రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ఉన్నాయో లేదో.. బీజేపీ పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులతో పెట్టుకున్నవారు ఎవ్వరూ మిగలేదని.. కేసీఆర్ తో పెట్టుకున్న బీజేపీ నాశనం అవుతుందని శపించారు.
రేవంత్ రెడ్డి ఆత్మ బీజేపీ చుట్టే తిరుగుతుందని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని విమర్శించారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఆయన పార్టీ నుంచే మద్దతు లభించడం లేదని.. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని హితవు పలికారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాంపల్లిలో ఉన్నాయి. వీరిద్దరు నాంపల్లి బ్రదర్స్ గా మారారని విమర్శించారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న విధంగా కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆయన అన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం అని.. బీజేపీ అంటే అమ్మకం అని ఆయన విమర్శించారు. బండి సంజయ్ తొండి సంజయ్ గా మారారన్నారు. కేసీఆర్ దీక్షను విమర్శించి సంజయ్ తెలంగాణ ప్రజల్ని అవమానపరిచారన్నారు.