అలిగిన కేశవరావు.. కాంగ్రెస్ హైకమాండ్ పై సీరియస్

-

తిరిగి మాతృ సంస్థకే చేరుకున్న కేశవ రావు అలియాస్ కేకే అప్పుడే అలక పానుపు ఎక్కారు. కేసీఆర్ కి కుడిభుజంలా వ్యవహరించిన ఆయన బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ దీప్‌దాస్ మున్షీలు తదితర సీనియర్ నేతలు కేకేతో ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా కేకేను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, కే. కేశవరావు, మధుయాష్కి సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్‌ ఎన్నిక, మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌ పెద్దలతో సీఎం రేవంత్‌ చర్చించారు. పీసీసీ రేసులో ఉన్న ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ సమావేశంలో ఉన్నారు. అయితే ఈ సమావేశాన్ని వదిలి కేకే వెళ్లిపోయారు. కేశవరావు అలా వెళ్తుంటే కనీసం ఎవ్వరూ ఆపలేదు. పార్టీలో చేరిన తనకు పీసీసీ పదవి ఇస్తారని కేకే ఆశలు పెట్టుకున్నారు. కానీ తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అలిగి వెళ్లిపోయారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై కేకే చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేతలకు నిరాశే ఎదురవుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ కి తేల్చిచెప్పింది. అయినప్పటికి కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. కేశవరావు కూడా పీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ లో ఆయన నంబర్ 2 స్థానంలో కొనసాగారు. పీసీసీ అధ్యక్ష పదవి అంటే కూడా నంబర్ 2 స్థానంలో కొనసాగడమే.అయితే కేశవరావు ఆశలపై నీళ్లు చల్లింది ఏఐసీసీ. అందుకే కేశవరావు కాంగ్రెస్ హైలెవెల్ మీటింగ్ ని వదిలి వెళ్లిపోయారు. మరి సీఎం రేవంత్ ఆయన్ను బుజ్జగుస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version