తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ లో మంత్రి పదవి ఆశిస్తున్న ఓ సీనియర్ నేతకి చుక్కలు చూపిస్తోంది. ఎంతో మంది సీనియర్స్ కేబినేట్ విస్తరణలో తమ పేరుఖరారు కావాలని పడరాని పాట్లు పడుతున్నారు. సీఎం కేసీఆర్ ని ఎలాగోలా ఒప్పించయినా సరే మంత్రి పదవి కొట్టేయాలని తెగ ఆరాట పడుతున్నారు. ప్రస్తుతం పదవులు ఆశిస్తున్న సీనియర్స్ లో మోస్ట్ సీనియర్ మాజీ ఎంపీ అయిన ప్రస్తుత ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే కేసీఆర్ కూడా గుత్తాకి మంత్రి పదవి ఇవ్వడానికి అభ్యంతరం లేదని అంటున్నారట…కానీ..
కేసీఆర్ మాత్రం గుత్తా కి మంత్రి పదవి ఇవ్వాలంటే తాను ఇచ్చే భాధ్యతని సమర్ధవంతంగా పూర్తి చేసి సక్సెస్ అయితేనే అంటూ కండిషన్ పెట్టారట. దాంతో గుత్తా తాడో పేడో తెలుచుకునే పనిలో పడ్డారట. ఇంతకీ కేసీఆర్ పెట్టిన ఆ కండిషన్ ఏమిటి…?? తెలంగాణా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ నియోజకవర్గం అయిన హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించి తీసుకురావడం. ఇప్పుడు ఈ విషయంపైనే టీఆర్ఎస్ వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది.
2014 ఎన్నికల తరువాత గులాబీ కండువా కప్పుకున్న గుత్తా , ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో నల్గొండ నుంచీ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయలేదు. కానీ ఆ స్థానం నుంచీ పోటీ చేసే అభ్యర్ధిని మాత్రం గెలిపిస్తానని కేసీఆర్ కి హామీ ఇచ్చారట. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ ఓడిపోవడం, ఉత్తమ్ ఎంపీగా పోటీచేసి గెలుపొందటం జరిగిపోయాయి. ఈ క్రమంలో కేసీఆర్ గుత్తాకి మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు అనే ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు హుజూజ్ నగర్ లో కనుకా టీఆర్ఎస్ అభ్యర్ధిని గుత్తా గెలిపించగలిగితే మాత్రం గుత్తా కి కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడం ఖాయమనే టాక్ రావడంతో హుజూజ్ నగర్ ఎన్నికలపై సర్వత్రా ఉత్ఖంట నెలకొంది. మరి కేసీఆర్ పెట్టిన కండిషన్ గుత్తా రీచ్ అవుతారో లేదో వేచి చూడాల్సిందే.