విపక్ష నేతను ఆయన మాదిరి ఎవ్వరూ తిట్టరు. సొంత సామాజికవర్గం మనిషే అయినా ఆయన మాదిరి అస్సలు తిట్టరు. తిట్లతోనే వార్తలలో నిలిచి పరువు పోగొట్టుకోవడం అన్నది ఇప్పటిదాకా ఎవ్వరూ చేయాలని అనుకోలేదు కానీ మళ్లీ మళ్లీ ఆ విధంగా ప్రవర్తించడంలో ఏం గొప్పదనం ఉందో ఆయనే చెప్పాలి. పొత్తులపై భయం లేదు అన్నప్పుడు 55 శాతం ఓట్లు వైసీపీ కే వస్తాయి అని అనుకున్నప్పుడు ఇంకా బెంగెందుకు? ఎలానూ ముందస్తుకు వెళ్తారు కదా! అలాంటప్పుడు యుద్ధం చేయాలి కానీ తిట్లు తిట్టి, ఎప్పటిలానే విచక్షణ మరిచి వ్యాఖ్యలు చేయడం వల్ల వైసీపీకే నష్టం.
ఓ విధంగా చూసుకుంటే కొడాలి నాని ప్రవర్తన కారణంగా విపక్షం తప్పక బలపడుతుంది. గతంలోనూ ఇలానే జరిగింది. వైసీపీని అధికారంలో ఉండగా టీడీపీ ఎన్నో సార్లు నిలువరించింది. ఫలితంగా టీడీపీ కన్నా వైసీపీనే ఎక్కువగా బలపడి అధికారం తెచ్చుకుని, ఇప్పుడు తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించి, మున్ముందుకు దూసుకుపోతోంది.
మళ్లీ వార్తల్లోనూ మళ్లీ మళ్లీ వివాదాల్లోనూ నిలిచి తన హవా సాగించేందుకు సిద్ధం అవుతన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇప్పటికే మంత్రి పదవి నుంచి తప్పించిన వారెవ్వరూ పెద్దగా మాట్లాడడం మానుకున్నా, కొడాలి నాని మాత్రం వీర విధేయతలో భాగంగా ఆ రెండు పార్టీలనూ తిడుతున్నారు. అంటే సింహం సింగిల్ గా వస్తుందని, పంజా దెబ్బను రుచి చూడాల్సి ఉంటుందని అధినేత జగన్ సమర్థతను కొనియాడుతూ, ఇదే సమయంలో అటు చంద్రబాబు ఇటు పవన్ కానీ జగన్ ను అధికారంలోకి రాకుండా మరోసారి నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు అని, అయితే తమకు ఈ విషయమై ఎటువంటి భయాలూ లేవని స్పష్టం చేశారు.
త్వరలోనే పొత్తులపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు జనసేన భావిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కొన్ని చర్చోపచర్చలు జరిగాయి. పవన్ మాత్రం తాము బీజేపీతో మైత్రి బంధంలోనే ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీతో పొత్తుకు సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. దీనిపై కూడా త్వరలో ఓ స్పష్టత వస్తే అప్పుడు కదా! మాటల యుద్ధం వైసీపీ చేయాలి. కానీ ఇప్పటి నుంచే కొడాలి నాని తన దాడిని మొదలు పెట్టారు. ఎప్పటిలానే బూతుల దండకం ఒకటి అందుకున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ ఇద్దరినీ ఉద్దేశించి రాయలేని భాషలో కొన్ని మాటలు అన్నారు.