వారంతా రైతులు. తమకున్న కొద్దిపాటి దీర్ఘకాలిక సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పదే పదే ఆఫీసుల చుట్టూ తిరిగారు. అధికారులకు మొక్కుకున్నారు. అయినప్పటికీ కలెక్టర్ పట్టించుకోలేదు. భరోసా దక్కలేదు. దీంతో దిక్కుతోచక క్రాప్ హాలిడే పాటిస్తున్నామన్నది కోనసీమ రైతుల మాట. వాస్తవానికి ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతుల సమస్యలు అన్నవి అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రస్తుతం కాలువ ఆధారిత వ్యవసాయం కనుక కొంతలో కొంత వ్యవసాయం నయంగానే ఉన్నా, ముందున్న కాలంలో ఇలాంటివి జరగవు. అందుకే రైతులు అప్రమత్తమై యంత్రాగానికి ఎప్పటికప్పుడు మొరపెట్టుకుంటున్నారు.
అయినా కూడా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎప్పుడూ బకాయిల చెల్లింపు అన్నది ఆలస్యంగానే ఉంది. వీటితో పాటు రుణాల మంజూరు కూడా గతంలో కన్నా ఇప్పుడు మరింత ఆలస్యం అవుతుంది అన్న ఆరోపణ కూడా బ్యాంకర్ల పై ఉంది. ఈ దశలో కోనసీమ రైతు తప్పక రోడ్డెక్కనున్నాడు. ఉద్యమించనున్నాడు.
ఈ నేపథ్యాన పచ్చని ప్రకృతి అందాలతో అలరారే కోనసీమ ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా వార్తల్లో నిలిచింది. తమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టవద్దంటూ రేగిన వివాదం పలు ఘర్షణలకు తావిచ్చింది. తరువాత అక్కడ 144 సెక్షన్ తో పాటు కఠిన చట్టాల అమలుతో కొంత పరిస్థితి అదుపులోకి వచ్చింది. సాధారణ పౌర జీవనం ఇప్పుడిప్పుడే సాధ్యం అవుతోంది. ఈ తరుణంలో మరో వివాదం నెలకొంది.
ఇప్పుడక్కడ పంట విరామం ప్రకటించేందుకు కొందరు రైతులు ప్రయత్నిస్తున్నారు. దీంతో వివాదం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కోనసీమ రైతు పరిరక్షణ సమితి పేరిట జరుగుతున్న ఈ ఉద్యమం కారణంగా ఎటువంటి పరిణామాలు జరగనున్నాయో మరి! అయితే టీడీపీ మాటలు నమ్మి ఎవ్వరూ పంట విరామానికి సంబంధించి ప్రకటన చేయవద్దని మంత్రి పినిపే విశ్వరూప్ విన్నవించారు. అలానే ధాన్యం కొనుగోలుకు సంబంధించి మరో రెండు రోజుల్లో నిధులు రైతుల ఖాతాకు విడుదల చేస్తామని చెప్పి మంత్రి వివాదానికి తెర దించే ప్రయత్నం చేస్తున్నారు.
క్రాప్ హాలీడే ఎందుకు ?
వాస్తవానికి పంటలు దిగుబడి బాగున్నా మార్కెట్ సపోర్ట్ పెద్దగా లేని కారణంగా ఏటా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే సాయం ఎంత మేరకు ఉపయోగపడుతుందో అన్నది అటుంచితే, అప్పులు మాత్రం దండీగానే ఉంటున్నాయి. ఈ క్రమాన కోనసీమలో కొందరు రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంట విరామానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 12 మండలాలు క్రాప్ హాలీడే ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే వైసీపీ సర్కారుకు మళ్లీ కష్టాలు మొదలుకావొచ్చు.