గ్రేటర్ పై ఇంకో సర్వే ? కేటీఆర్ ఇజ్ఞత్ కా సవాల్ ?

-

గ్రేటర్ ఎన్నికల్లో గట్టెక్కుతాము అనే ధీమా టిఆర్ఎస్ పెద్దల్లో ఇప్పటికీ కనిపించడంలేదు. మొదట్లో జిహెచ్ఎంసి పై  టిఆర్ఎస్ జండా మాత్రమే ఎగురుతుంది అనే అభిప్రాయంలో ఉంటూ వచ్చిన ఆ పార్టీ పెద్దలకు ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు అంతుపట్టని విధంగా మారాయి. రోజు రోజుకి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న ట్లుగా కనిపిస్తుండటం, అదే సమయంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందడం ఇవన్నీ పెద్ద తలనొప్పిగా మారాయి. ఖచ్చితంగా వాటి ప్రభావం మిగతా అన్ని ఎన్నికలపైన పడుతుందనే ఆందోళనలో ఆ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

అలాగే ఆకస్మాత్తుగా గ్రేటర్ లో వరదలు సంభవించడం, ఆ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందనే వాదనను ప్రతిపక్షాలు బలంగా తీసుకువెళ్లడం, ప్రజల్లోనూ వరద సహాయం పంపిణీ పైన, మరికొన్ని విషయాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం, ఇలా ఎన్నో అంశాలు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.

ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే , గ్రేటర్ లో గెలుపు కోసం టిఆర్ఎస్ ఇప్పటికే అనేక సర్వేలను చేయించేది. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఏమిటి ?  ఇంకా ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలు ?  ప్రస్తుత కార్పొరేటర్ల పై ఉన్న  వ్యతిరేకత , సానుకూలత ఇలా ఎన్నో అంశాలపై వివిధ రూపాల్లో సర్వే చేయించిన కేటీఆర్ ఇప్పుడు తాజా పరిణామాలపైనా, ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ ప్రభావం జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ విధంగా పడింది అనే అంశాల పైన ఇలా అనేక అంశాలపైనా  సర్వే చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే పెద్ద ఎత్తున కార్పొరేటర్లు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ఎప్పుడో గ్రహించిన కేటీఆర్ ఆ స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇదిలా ఉంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని టిఆర్ఎస్ ముందుగా అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రభుత్వం సైతం ముందు సానుకూలంగా ఉన్నా, ఆ తరువాత ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందనే కారణంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

గ్రేటర్ లో టిఆర్ఎస్ విజయం కనుక దక్కకపోతే, ఆ ప్రభావం అందరికంటే ఎక్కువగా కేటీఆర్ పైనే ఉంటుంది. సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆశతో ఉన్న సమయంలో ఈ విధమైన పరిణామాలు చోటుచేసుకోవడం కాస్త ఇబ్బందికరంగానే కనిపిస్తున్నాయి.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version