టీఆర్ఎస్ జ‌డ్పీచైర్మ‌న్‌కు మావోల వార్నింగ్‌

-

తెలంగాణ‌లో మావోలు త‌మ ఉనికిని చాటుకునేందుకు మ‌ళ్లీ అల‌జ‌డి రేపారు. కొద్ది రోజులుగా వ‌రుస ఎనౌకౌంట‌ర్ల‌తో అజ్ఞాతంలోకి వెళ్లిన మావోలు తాజాగా అధికార జ‌డ్పీ చైర్మ‌న్‌కు వార్నింగ్ ఇవ్వ‌డం ద్వారా మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని సీపీఐ మావోయిస్టు మహదేవపూర్‌ – ఏటూరు నాగారం ఏరియా కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. ఆయనతో పాటు కాటారం మాజీ ఏఎంసీ చైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాసరావుకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.

ఈ మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెలలో కరపత్రాలను మావోలు విడుదల చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మేడిగడ్డ బ్యారేజ్ భూసేకరణలో భాగంగా మహదేవ్ పూర్ రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని పుట్ట మధు దండుకున్నారని, కోట్లాది రూపాయలను బాధితులకు అందకుండా చేశారని ఆరోపించారు.

నాడు కాటారం డీఎస్పీగా ఉన్న ప్రసాదరావుతో కలిసి ప్రజలను భయాందోళనలకు గురి చేశారని వారు త‌మ లేఖ‌లో ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల సొమ్ములను తిరిగి చెల్లించాలని, లేకుంటే ప్రజల చేతిలోనే శిక్షింపబడతారని వారు హెచ్చరించారు. ఈ హెచ్చిరిక‌ల‌తో ఒక్క‌సారిగా అధికార పార్టీలో క‌ల‌క‌లం రేగిన‌ట్ల‌య్యింది. తెలంగాణ పోలీసులు, ఆంధ్రా, మ‌హారాష్ట్ర బోర్డ‌ర్లో అలెర్ట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version