అనూహ్యంగా మునుగోడు టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే. ముందస్తుగా మీడియాకు ఎలాంటి సమాచారం లేకుండానే సడన్ గా మునుగోడు నేతలని ప్రగతి భవన్‌కు పిలిపించి..వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కీలక నేతలంతా వచ్చారు. ఈ క్రమంలో మునుగోడులో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. అలాగే అక్టోబర్‌లో ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని, నవంబర్‌లో ఎన్నిక జరుగుతుందని కేసీఆర్, నేతలకు వివరించారు.
ఇదే సమయంలో అభ్యర్ధి ఎవరనే దానిపై చర్చ జరిపారు. నాయకుల అభిప్రాయం తీసుకున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి వర్గం అభ్యర్ధులనే పెట్టారు. దీంతో బీసీ అభ్యర్ధిని పెడితే ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో టికెట్ ఆశిస్తున్న వారు పాల్గొన్నారు. అలాగే నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య కూడా హాజరయ్యారు. అయితే బీసీ అభ్యర్ధి విషయంలో కేసీఆర్ వెనుకగడుగు వేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కేసీఆర్…కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. ఆయననే దాదాపు అభ్యర్ధిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. కాకపోతే ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక అధికారికంగా కూసుకుంట్లని ప్రకటిస్తారని సమాచారం. అలాగే మునుగోడులో సంక్షేమ పథకాలు అందేవారిని పదే పదే కలవాలని, దళితబంధు ఇంకా ఎక్కువగా అమలు చేయాలని, గిరిజన బంధు గురించి వివరించాలని కేసీఆర్…నేతలకు సూచించారు.
ఇక మరొకసారి సర్వే గురించి కేసీఆర్ మాట్లాడారు. ఆ మధ్య మనకే గెలుపు అవకాశాలు ఉన్నాయని, కాంగ్రెస్ రెండు, బీజేపీ మూడో స్థానంలో ఉందని కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా కూడా పార్టీ నేతలతో అదే విషయాన్ని స్పష్టం చేశారని తెలిసింది. సర్వేలు అన్నీ టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని, పార్టీ తప్పనిసరిగా గెలుస్తుందని, నాయకులు ఇంకా కష్టపడాలని సూచించారు. మొత్తానికి మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ఫిక్స్ అయ్యేలా ఉన్నారు.