అధికార బిఆర్‌ఎస్ పార్టీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ వాళ్ళకే పడటం లేదు. సీటు కోసం నేతలు పోటీ పడుతూ ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఇదే క్రమంలో సీటు దక్కే అవకాశం లేదనుకునే నేతలు పార్టీ మారిపోవడానికి చూస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు వారు ఆసక్తి చూపిస్తున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీకి సీన్ రివర్స్ అవుతుంది. మామూలుగానే ఆ జిల్లాలో కాంగ్రెస్ పట్టు ఎక్కువ. కానీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలని లాక్కుని బిఆర్‌ఎస్ బలపడింది. ఇప్పుడు ఓవర్ ఫ్లో అవ్వడంతో రచ్చ జరుగుతుంది. దీంతో కొంతమంది నేతలు బయటకొచ్చేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బిఆర్‌ఎస్ వీడేందుకు రెడీ అయ్యారు. 2018లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్య గెలిచారు. గెలిచాక బిఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో అక్కడే ఉన్న వేముల వీరేశంకు ప్రాధాన్యత తగ్గింది.
నెక్స్ట్ సీటు కూడా గ్యారెంటీ లేదు. దీంతో ఆయన బిఆర్‌ఎస్ వదిలి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇక తుంగతుర్తిలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ వైఖరి నచ్చక బిఆర్‌ఎస్ నేత మందులు సాములు బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉంది. అటు మాజీ ఎంపీ చకిలం శ్రీనివాసరావు కుమారుడు అనిల్ ఊ బిఆర్‌ఎస్ లో ప్రాధాన్యత లేదు. దీంతో ఆయన పార్టీని వీడటానికి రెడీ అయ్యారు.
గతంలో కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్ లోకి వెళ్ళిన ముత్తవరపు పాండురంగరావు..మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు చూస్తున్నారు. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తో హుజూర్‌నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనుకు పడటంలేదు. ఎమ్మెల్యే తనని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి శ్రీను పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలామంది బిఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేలా ఉన్నారు.