ఉమ్మడి నల్గొండ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటివరకు ఇక్కడ బిఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారుతూ వెళుతుంది. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఈ జిల్లాలో బలమైన కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పైగా ఇప్పుడు వలసలు జోరు కొనసాగుతుంది. ఇటీవల కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం కాంగ్రెస్ లోకి వచ్చారు. దీంతో భువనగిరి, నకిరేకల్ రాజకీయాలు వేగంగా మారాయి.
గతంలో ఈ రెండు సీట్లు కాంగ్రెస్‌కు పట్టున్నవి. కానీ తర్వాత బిఆర్‌ఎస్ చేతుల్లోకి వెళ్ళాయి. గత ఎన్నికల్లో నకిరేకల్ లో కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్య గెలిచి..బిఆర్‌ఎస్ లోకి వెళ్లారు. ఇక అక్కడ బిఆర్‌ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరేశం ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో లింగయ్యకు కేసిఆర్ సీటు ఫిక్స్ చేశారు. దీంతో వీరేశం ఇప్పుడు బిఆర్‌ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు. దీంతో నకిరేకల్ లో బిఆర్‌ఎస్ పార్టీకి ఎదురుగాలి మొదలైంది. అక్కడ ఎమ్మెల్యే లింగయ్యకు బిఆర్‌ఎస్ లోనే అనుకూలత తక్కువ ఉంది.
ఇటు భువనగిరిలో బిఆర్‌ఎస్ అభ్యర్ధిగా ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డిని ఫిక్స్ చేశారు. అయితే గత రెండు సార్లు ఆయనే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అంత పాజిటివ్ లేదు. ఇదే సమయంలో మొన్నటివరకు కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి..బిఆర్‌ఎస్ లోకి వెళ్లారు. దీంతో అంతా బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని అనుకున్నారు.
కానీ ఊహించని విధంగా అనిల్…మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చేశారు. దీంతో సీన్ మారిపోయింది. భువనగిరిలో బిఆర్‌ఎస్ పార్టీకి సానుకూలత కనిపించడం లేదు. మొత్తానికి ఈ రెండు చోట్ల బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ బ్రేకులు వేసేలా ఉంది.