బాధ మరియు దుఃఖం అన్నవి రెండూ ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. పదవి పోయిన బాధ, పదవి లేదన్న దుఃఖం ఈ రెండే నాయకులను ఉన్నచోట ఉండనీయవు. ఆ కారణంగా ఏపీ లో ఎన్నో బాధలు ఎన్నో దుఃఖాలు ఉన్నాయి. నియోజకవర్గానికి పనులు చేయించుకోలేకపోతున్నామన్న బాధ కన్నా నియోజకవర్గంలో బుగ్గ కారులో తిరుగలేకపోతున్నామన్న బాధే ఎక్కువగా వాళ్లలో ఉంది. ఎస్కార్టు వెహికల్ లేకుండా ఆ రోజు తాము తిరిగింది లేదని, ఇప్పుడు ఆ గౌరవం కూడా లేకుండా పోయిందని మాజీ మంత్రులు ఆవేదన చెందుతున్నారు. కొందరు స్పోర్టివ్ గానే సీఎం నిర్ణయాన్ని తీసుకున్నారు కానీ కొందరు మాత్రం బాధను వ్యక్తం చేయలేక, లోపల దాచుకోలేక అంతర్మథనం చెందుతున్నారు. ఆ విధంగా సీఎం దగ్గరకు మళ్లీ వెళ్లి తమ గోడు వినిపించుకుంటున్నారు కూడా !
మంత్రి వర్గ విస్తరణ తరువాత కూడా కొత్త మంత్రులు ఎవరు ఏంటి అనుకుంటున్నారా ? ఆంధ్రావనిలో ఎప్పుడు ఏ పరిణామం ఎందుకు జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడు ఎవరు ఎందుకు పదవి కోల్పోతారో కూడా చెప్పలేం. వైసీపీ అధినేత నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. పదవులు లేవు అని ఆ క్షణానికే చెప్పి పదువులు ఇచ్చి గౌరవం పెంచి బాధ్యతగా ఉండమని చెప్పిన దాఖలాలు చాలా ఉన్నాయి.
ఇదే విధంగా కొత్త మంత్రులు 14 మంది వచ్చారు. 11 మంది పాత వాళ్లే ఉన్నారు. కనుక వెళ్లిన వాళ్లకు మంత్రి హోదాలు పోయిన వారకు, దుఃఖం గుండె నిండా ఉంది. కన్నీళ్లు ఆగడం లేదు. అందుకే వారంతా తమ తమ ప్రయత్నాలు ఆఖరివరకూ సాగించారు. కొందరైతే అనుకున్నది సాధించి తామేంటో నిరూపించుకున్నారు. ప్రొటొకాల్ కు తప్ప ఏ నిర్ణయం తీసుకోలేని పదవులు అవి అని విపక్షం సెటైర్లు వేసినా జిల్లాలలో తలెత్తుకు తిరగలేం కనుక బాలినేని లాంటి వారు ఇప్పటికీ దుఃఖం నిండిన బాధ నిండిన హృదయంతోనే మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కొత్త మంత్రులు లెవరు ఏంటి ఆ కథ అన్నది చూద్దాం.
మంత్రి వర్గ విస్తరణ తరువాత సీఎం మరో ఆలోచన చేశారు. మాజీ మంత్రులకు జిల్లాల అధ్యక్షలుగా నియమించారు. కొంత సీనియార్టీ మరియు సిన్సియార్టీ ఉన్న వాళ్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రీజనల్ కో ఆర్టినేటర్లుగా తీసుకున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. అభివృద్ధి మండళ్ల పేరిట త్వరలోనే వీరిని సంబంధిత అధ్యక్ష పదవుల్లోకి తీసుకోనున్నారు. దీంతో త్వరలో 26 జిల్లాలకు డెవలప్మెంట్ అథారిటీలు రానున్నాయి. మంత్రి హోదాలోనే వీళ్లూ
పనిచేయనున్నారు. అదేవిధంగా ఇప్పటి మాజీలు అంతా రానున్న 2024 నాటికి మంత్రులు కూడా కావడం ఖాయం అని సీఎం స్పష్టంగా చెప్పారు. దీంతో మాజీలంతా ఆనందం వ్యక్తం చేస్తూన్నారు. మే లో నిర్వహించే గడపగడపకూ వైసీపీ కార్యక్రమానికి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధం అవుతున్నారు.