ఫలించిన నితీష్‌ రాయభారం.. ఆప్‌తో కాంగ్రెస్‌ దోస్తీ

-

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ మరో మెట్టు పైకి ఎక్కింది. దూరంగా ఉంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఈ ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ విషయమై ట్విట్టర్‌ వేదికగా ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జున ఖర్గే ఫోటో కూడా పంచుకున్నారు. నితీష్‌తో రాహుల్‌,ఖర్గే భేటీ తరువాత కాంగ్రెస్‌ వైఖరిలో అనూహ్య మార్పు వచ్చింది. ఆప్‌కి కాంగ్రెస్‌ కి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

అయితే నితీష్‌ చొరవతో ఈ అడ్డంకులు తొలగిపోయాయని అంటున్నారు ఏఐసీసీ నేతలు. బీజేపీకి వ్యతిరేకంగా ఆప్‌ చేస్తున్న పోరాటాల్లో అండగా ఉంటామని కాంగ్రెస్‌ ఈ మేరకు స్పష్టం చేసింది.ఆమ్‌ ఆద్మీ పార్టీ. . . .కాంగ్రెస్‌ పార్టీ. . . ఈ రెండు బీజేపీ వ్యతిరేకులే అయినప్పటికీ ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్‌తో ఆప్‌ కలిసింది లేదు. ఈ రెండు పార్టీల మధ్య చాలా దూరమే ఉంది. బీజేపీని ఎదిరించి ఎన్నికల్లో ఓడించాలంటే ఒక్క కాంగ్రెస్‌ పార్టీ వల్ల అయ్యే పనికాదు. అందుకే కాస్త దిగి వచ్చి మెల్లమెల్లగా ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టుకుంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఈ క్రమంలోనే ఆప్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. నితీష్‌ రాయభరంతో ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది.

ఆప్‌తో కాంగ్రెస్‌ ఎందుకు కలవాల్సి వచ్చిందంటే. . . . .ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ని వ్యతిరేకిస్తోంది ఆమ్‌ ఆద్మీ పార్టీ. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కే అధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకించాలని కూడా కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఢిల్లీలో పాలనాధికారాలపై ఢిల్లీ పీసీసీనేతలు సమర్ధించగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ వ్యతిరేకించింది. అయితే నితీష్‌ రాయభారంతో ఆప్‌ విషయంలో కాంగ్రెస్‌ వైఖరి మారింది. బీజేపీని ఓడించాలంటే విపక్షాలు ఏకం కావాలన్న నితీష్‌ మాటలకు కాంగ్రెస్‌ తలొగ్గింది. ఆర్డినెన్స్‌ విషయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా అన్ని పార్టీల మద్ధతు కోరతామన్నారు. ఈ నేపథ్యంలో నితీష్‌ రాయభారం కేజ్రీవాల్‌ గొంతుకి మరింత బలాన్ని చేకూర్చింది. ఆప్‌కి కాంగ్రెస్‌ మద్ధతు కూడగట్టడంతో నితీష్‌ కీలకపాత్ర పోషించారనే చెప్పాలి. నితీష్‌ సమావేశం విపక్షాల ఐక్యతకు గట్టి పునాది అని ఖర్గే ట్వీట్ చేశారు. దీనిని దేశ ఐక్యతగా ఆయన అభివర్ణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version