బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌!

-

ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్‌ ఆర్జేడీ-లెఫ్ట్‌-కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌తో జట్టుకట్టారు. దీంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. బుధవారం సాయంత్రం 4గంటలకు బిహార్‌ సీఎంగా నీతీశ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

భాజపాతో తెగదెంపులు చేసుకున్నామని.. ఆర్జేడీ సారథ్యంలో ఏడు పార్టీలతో కూడిన మహాఘట్‌బంధన్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఇప్పటికే నీతీశ్‌ గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా ఈ ఒక్కరోజే నీతీశ్‌ వరుసగా రెండుసార్లు గవర్నర్‌ ఫాగు చౌహాన్‌తో భేటీ అయ్యారు. తొలిసారి భేటీలో భాజపాతో తెగదెంపులు చేసుకున్న విషయాన్ని గవర్నర్‌కు చెప్పి రాజీనామా లేఖను అందజేసిన నీతీశ్‌..  రెండోసారి భేటీలో ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్‌బంధన్‌ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు.

తమకు ఏడు పార్టీల మద్దతు ఉందని నీతీశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు మొత్తంగా 164మంది సభ్యుల మద్దతు ఉందని చెప్పారు. వారంతా తమకు మద్దతుగా లేఖపై సంతకాలు చేసినట్టు తెలిపారు. ఈ బలంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీల కోరిక మేరకే తెగదెంపులు చేసుకున్నామని.. పార్టీ సభ్యులందరి ఏకాభిప్రాయంతోనేనే తాను సీఎం పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయాలని పార్టీ నేతలే కోరారని చెప్పారు.

హిందీ బెల్ట్‌ రాష్ట్రాల్లో భాజపాకు భాగస్వామ్య పార్టీలేవీ లేవని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. భాజపా ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ఆ పార్టీలను నాశనం చేస్తుందనే విషయాన్ని చరిత్రే చెబుతోందన్నారు. పంజాబ్‌, మహారాష్ట్రలలో జరిగిందేమిటో మనం చూశామని చెప్పారు. భాగస్వామ్య పార్టీలను చీల్చి భాజపా పగ్గాలు చేపట్టాలనుకుందని ఆక్షేపించారు. బిహార్‌లోనూ జేడీయూని చీల్చి భాజపా సొంతంగా పాలించాలనుకుందన్నారు. సీఎం నీతీశ్‌కుమార్‌ త్వరగా మేల్కొని భాజపా కూటమి నుంచి బయటకు వచ్చారని చెప్పారు. ప్రాంతీయ పార్టీలను అంతం చేస్తామని జేపీ నడ్డా చెబుతుంటారని.. ప్రజల్ని భయపెట్టడం, కొనుగోలు చేయడమే భాజపాకు తెలుసని విరుచుకుపడ్డారు. బిహార్‌లో భాజపా అజెండా అమలు కాకూడదనే తామంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. నీతీశ్‌ కుమార్‌ దేశంలోనే అత్యధిక అనుభవం కలిగిన సీఎం అన్నారు.

నీతీశ్‌ కుమార్‌ నాయకత్వంలో బిహార్‌ అభివృద్ధి చెందుతోందని మాజీ సీఎం, హిందుస్థానీ అవామీ మోర్చా చీఫ్‌ జితిన్‌ రామ్‌ మాంఝీ కొనియాడారు. బిహార్‌ అభివృద్ధికి రూపశిల్పిగా ఆయన్ను అభివర్ణించారు. ఆ విశ్వాసంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయనతో కలిసి పనిచేయాలని శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version