పుట్టమధు అరెస్టు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఆయన అరెస్టు అయిన వెంటనే ఆయన అనుచరులను పలువురిని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆయనకు సన్నిహితులుగా ఉన్న వారిపై కూడా పోలీసులు దృష్టి పెడుతున్నారు.
ఇప్పుడు పుట్టమధు భార్య శైలజకు కూడా ఈ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలంటూ అందులో తెలిపారు. ఇప్పుడు ఆమె పెద్దపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అయితే ఆమెకు హత్య కేసుతో సంబంధాలు ఉన్నట్టు ఇంత వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు.
మరి అలాంటప్పుడు ఆమెకు ఎందుకు నోటీసులు ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదులో భాగంగానే ఆమెకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక పుట్ట మధును రెండోరోజు ఆదివారం కూడా విచారణ జరిపారు పోలీసులు. ఇందులో కీలకమైన ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. హత్య జరగడానికి ముందు పుట్టహదు బ్యాంకు నుంచి 2కోట్లు డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇలా పలు విషయాలపై విచారణ జరుపుతున్నారు. మరి శైలజను కూడా అదుపులోకి తీసుకుంటారా లేక విచారణ మాత్రమే చేస్తారా అనేది చూడాలి.