మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బాబు అరెస్ట్ జాతీయస్తాయిలో చర్చకు దారి తీసింది. ఆయనకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సొంతపార్టీ వారే కాకుండా ఇతర పార్టీల నాయకులు కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలు మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్ కూడా చంద్రబాబు అరెస్టు తీరును గర్హంచారు. అయితే బాబు కుటుంబసభ్యుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు అరెస్టును ఇటు నారా ఫ్యామిలీ, అటు నందమూరి ఫ్యామిలీ సభ్యులంతా తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్ట్ అంటూ వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. భువనేశ్వరీ, లోకేష్, బ్రాహ్మణి, నారా రోహిత్, పురంధేశ్వరీ, బాలకృష్ణ, రామకృష్ణ, చైతన్యకృష్ణ బాబు అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. రెండు కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రియాక్ట్ కాలేదు. కనీసం సోషల్ మీడియాలోనూ రెస్పాండ్ కాలేదు. కారణమేంటి ? ఒకవేళ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారా ? ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి సందర్భంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ రియాక్ట్ కాకపోవడానికి వ్యక్తిగత కారణాలా ? లేక రాజకీయ కోణాలా ?
నిజానికి 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున, చంద్రబాబు తరఫున జూనియర్ ఎన్టీఆర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన గెలుపు కోసం పసుపు కండువా కప్పుకుని చైతన్యరథంపై ఊరూరా తిరిగి క్యాంపెయిన్ చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ మాట తీరు, ఉత్సాహం, చరిష్మా… తాత నందమూరి తారక రామారావునే తలపించారు. క్రియాశీల రాజకీయాల్లో ఎన్టీఆర్ అడుగు పెట్టేశాడనే జనం అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మానియా చూసి చంద్రబాబు షాక్ గురయ్యారు. ఎన్నికల తర్వాత జూనియర్ ను నైస్ గా సైడ్ చేసేశారు. ఎన్టీఆర్ యాక్టివ్ అయితే తన కొడుకు లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్ కి ఎక్కడ బ్రేక్ పడుతుందోనని భావించి చెక్ పెట్టేశారు. అలా కొన్ని సంవత్సరాలుగా జూనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఎన్టీఆర్ ని దూరం పెట్టడంలో చంద్రబాబు పాత్ర ఉందనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున సాగింది. నాటి నుంచి చంద్రబాబుకు ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది.
ఇటీవల తారకరత్న హఠాన్మరణం సమయంలోనూ చంద్రబాబు, ఎన్టీఆర్ పక్కపక్కన ఉన్నప్పటికీ మాట్లాడుకున్న సందర్భంగా తారసపడలేదు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభంలోనూ తారక్ కనిపించలేదు. ఇక ఢిల్లీలో జరిగిన ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం ఆవిష్కరణలోనూ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందినా… ఆయన జాడ మాత్రం లేదు. నారా, నందమూరి కుటుంబాల్లోని ముఖ్యులంతా ఈ కార్యక్రమానికి వచ్చేసినా, జూనియర్ మాత్రం రాలేదు. ఇలా చంద్రబాబు పాల్గొన్న ఏ ఈవెంట్ లోనూ ఎన్టీఆర్ కనిపించిన దాఖలాలు లేవు. నాడు వచ్చిన గ్యాప్ ఇంకా వెంటాడుతూనే ఉండడంతో ఇప్పుడు కూడా బాబు అరెస్టుపై తారక్ స్పందించడం లేదనే పుకారు తెరపైకి వస్తోంది. ఇది పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సినీ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.