శాశ్వత రాజధాని అమరావతే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన బిజెపి నేతలు కన్నా లక్ష్మీ నారాయణ జివిఎల్ నరసింహారావు తో కలిసి ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసారు. ఈ సందర్భంగా ఆమెతో కీలక విషయాలు నేతలు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పని తీరు మారలేదని ఆయన ఆరోపించారు. త్వరలోనే రాజధాని పై బిజెపి జనసేన కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన అన్నారు. మూడు రాజధానులు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అన్న ఆయన దానికి కేంద్ర ప్రభుత్వ అంగీకారం లేదని, వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడుతున్నారని, అసలు అంగీకరించలేదని ఆయన అన్నారు.
కేంద్రం నుంచి చాలా నిధులు వస్తున్నాయన్న ఆయన కీలక అంశాలను మంత్రితో చర్చించామన్నారు. రాష్ట్ర విభజన నుంచి ఎం జరిగింది అనేది చర్చించామని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. 5 కోట్ల మందికి మాట ఇస్తున్నాం అమరావతి శాశ్వత రాజధాని అన్నారు. రాజధాని మార్చడం అనేది చాలా కష్టం అన్నారు. ఢిల్లీ కేంద్రం నుంచి మద్దతు ఉందని అంటున్నారు. ఇప్పుడు నేను అక్కడి నుంచే చెప్తున్నా రాజధాని మారే అవకాశం లేదని ఆయన స్పష్టం చేసారు.