‘వంద కోట్లకు’ గువ్వల పోస్టర్లు..ఆడుకుంటున్నారుగా..!

-

తెలంగాణలో నలుగురు టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బేరసారాలు సాగించిన ముగ్గురు వ్యక్తులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కొంతమందిని విచారిస్తున్నారు. ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. నిందితుల బెయిల్ పిటిషన్ ‌పై విచారణ వాయిదా పడింది.  కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రతను పెంచింది.

ఇదిలా ఉండగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వంద కోట్లకు అమ్ముడుపోయాడు అంటూ అచ్చంపేటలో పోస్టర్లు వెలిశాయి. వంద కోట్లు ఆశించే ఫామ్ హౌస్ వరకు వెళ్లారని, లేదంటే వెళ్ళేవారు కాదని, అచ్చంపేట ఆత్మగౌరవాన్ని వందకోట్లకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమ్ముకున్నాడని సంచలన ఆరోపణలు చేస్తూ వేసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

గువ్వల బాలరాజును అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరిమికొడదామని పోస్టర్లు పెట్టారు. అలాగే నియోజకవర్గంలో గతంలో జరిగిన అనేక సంఘటనలను కూడా ఏకరువు పెట్టి ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. గువ్వల బాలరాజు వికలాంగుడైన శ్రీను పై దాడి చేశారని, గిరిజన సర్పంచ్ పై దాడికి పాల్పడ్డారని, ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించిన కార్యకర్తలపై దాడి చేశారని చెప్పి పలు ఘటనలని పోస్టర్లలో వేశారు. అయితే ఈ పోస్టర్లని ఎవరో వేశారనేది క్లారిటీ లేదు. ఇది కాంగ్రెస్ పనా? లేక బీజేపీ పనా? అనేది క్లారిటీ లేదు.

ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గువ్వల సిద్ధమవుతున్నారు. ఫామ్ హౌస్ ఎపిసోడ్ తర్వాత గువ్వలకు ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆ మధ్య నువ్వు వంద పైసలు విలువ చేయవు, మళ్ళీ నిన్ను వంద కోట్లు పెట్టి కొంటారా అని కొందరు మాట్లాడారు. మొత్తానికి గువ్వల టార్గెట్ గా ప్రత్యర్ధులు రాజకీయం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version