తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.. పోటీ చేస్తే గెలిచేస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య పెరుగుతుంది.. పార్టీలో కీలక నేతలు, ఇంకా ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్లు రానివారు ఎంపి స్థానాలపై కన్నేశారు.. నిజామాబాద్ ఎంపీ సీటుకు పోటీ పెరిగింది..
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారట.. ఆయనతోపాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అనిల్, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి తో పాటు మరికొందరు ముఖ్య నేతలు తమకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.. అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ కూడా పోటీలో ఉన్నారని తెలుస్తోంది..
మహిళా కోటాలో ఆకుల లలిత తన ప్రయత్నాల్లో నిమగ్నమైందని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు..నిజామాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్లో అరడజన్ కి పైగా నేతలు పోటీ పడుతుంటే.. ఓ ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కలవరపెడుతోంది.. సిధి నిర్మాత దిల్ రాజు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.. మోపాల్ మండలం నర్సింగ్ పల్లి చెందిన దిల్ రాజ్ పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారట.. ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే పార్టీ పెద్దలను కోరారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఆర్థికంగా బలమైన వ్యక్తిగా ఉన్న దిల్ రాజును పోటీ చేయిస్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది..