బీజేపీకి రాజాసింగ్ ఎస‌రు… అస‌లు రీజ‌న్ అదే…!

-

రాజాసింగ్‌. తెలంగాణ రాజ‌కీయాల్లో ఆయ‌నో ఫైర్ బ్రాండ్. ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలాన్ని పుణికి పుచ్చుకున్న సింగ్‌.. బీజేపీ వాయిస్ వినిపించ‌డంలో త‌న‌దైన శైలిలో దూసుకుపోయే నాయ‌కుడిగా గుర్తింపు సాధించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన అతిర‌థ మ‌హార‌థుల‌ను కూడా ప్ర‌జ‌లు ఓడించారు. కానీ, ఒక్క రాజాసింగ్ మాత్రం ఘోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించి.. కాషాయ జెండా ప‌రువు కాపాడారు. కేసీఆర్‌పైనా.. ప్ర‌భుత్వంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ.. నిత్యం మీడియాలో ఉండే సింగ్‌కు ఇప్పుడు సొంత పార్టీలోనే ఆద‌ర‌ణ త‌గ్గింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

తెలంగాణ ఎన్నిక‌ల్లో కీల‌కంగా ఉన్న సింగ్‌.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ ముఖ్య పాత్ర పోషించాల‌ని అనుకున్నా డు. అయితే.. కొంద‌రు కీల‌క నాయ‌కులు మాత్రం సింగ్‌ను తొక్కేస్తున్నార‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే సింగ్ వ‌ర్గం కూడా ఆరోపిస్తోంది. సోష‌ల్ మీడియాలోనూ సింగ్ గొంతుతో ఉన్న మెసేజ్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. “నేను బీజేపీ ప‌రువు కాపాడాను. 2018లో నా స‌త్తా చూపించాను. అయినా.. న‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు. న‌న్ను తొక్కేస్తున్నారు“ అంటూ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్నారు. దీంతో హైద‌రాబాద్‌లో బీజేపీపై వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రుగుతోంద‌నే టాక్ వినిపిస్తోంది.

టీఆర్ ఎస్‌పై ప‌ట్టు పెంచుకుని గ్రేట‌ర్‌లో పాగావేయాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి త‌గ్గ‌ట్టే.. ముందుకు సాగుతోంది. శ‌క్తిని కూడ‌గ‌ట్టుకుని.. మ‌రీ ప్ర‌చారం చేస్తోంది. అయితే.. ఇప్పుడు రాజాసింగ్ ఆడియో టేపులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. మ‌రి ఇదంతా ఎందుకు జ‌రుగుతున్న‌ట్టు అనే సందేహం తెర‌మీదికి వ‌చ్చింది. కొంచెం వెన‌క్కి వెళ్లి ప‌రిశీలిస్తే.. రాజాసింగ్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాల‌ని ప్ర‌స్తుత బీజేపీ నేత‌లు ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో గ్రేట‌ర్ ప‌రిధిలోని త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వార్డుల అభ్య‌ర్థుల ఎంపిక‌ను త‌న‌కు అప్ప‌గించాల‌ని సింగ్ కోరారు.

అయితే.. బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం.. సింగ్ అభ్య‌ర్థ‌న‌ను తోసిపుచ్చి.. సింగ్‌కు అనుకూల వ్య‌క్తుల‌కు కాకుండా.. వేరేవారికి అవ‌కాశం ఇచ్చింది. ఈ ప‌రిణామంతో హ‌ర్ట్ అయిన సింగ్.. త‌న‌ను ఉద్దేశ పూర్వ‌కంగా తొక్కేయాల‌నే ఇలా చేస్తున్నారంటూ.. ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఇదే విష‌యాన్ని ఆడియోగా ప్ర‌చారంలోకి తెచ్చార‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేను ఇలా సాధించ‌డం ద్వారా బీజేపీ కీల‌క స‌మ‌యంలో త‌ప్పుచేస్తోంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది.. ఓటు బ్యాంకుపై ప్ర‌భావం చూపుతుంద‌ని కూడా అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version