ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం పై ఎవ్వరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవ్వరూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ పై రుద్దొద్దని పేర్కొంది.
ఇటీవలే సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవీ ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ఎవ్వరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తాజాగా హోంమంత్రి అనిత సైతం లోకేష్ హోంమంత్రి పై స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ అంశం పై ఎవ్వరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.