గజ్వేల్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ అడ్డా అనే సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ బరిలో ఉన్నా సరే ఇక్కడ కేసీఆర్‌దే విజయమని చెప్పొచ్చు. కానీ ప్రత్యర్ధులు కేసీఆర్‌కు ఎలాగోలా చెక్ పెట్టాలని చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్‌కు కాస్త బలం ఉందనే చెప్పొచ్చు.
పైగా గతంలో గజ్వేల్‌లో కాంగ్రెస్ ఎక్కువసార్లు గెలిచింది. 2009లో చివరిగా కాంగ్రెస్ గెలిచింది. అయితే అలా కాంగ్రెస్‌కు బలంగా ఉన్న గజ్వేల్…కేసీఆర్ ఎఫెక్ట్‌తో టీఆర్ఎస్ వశమైంది. అయితే ఏదొకరంగా కేసీఆర్‌కు చెక్ పెట్టాలని టీపీసీసీ రేవంత్ రెడ్డి చూస్తున్నారు. పైగా తన సొంత నియోజకవర్గంలో కేసీఆర్‌ని నిలువరిస్తే అప్పుడు కాంగ్రెస్‌కు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. కానీ గజ్వేల్‌లో ఆ పరిస్తితి ఉన్నట్లు కనిపించడం లేదు.
ఇక్కడ కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ కాంగ్రెస్‌ని తూముకుంట నర్సారెడ్డి నడిపిస్తున్నారు. కానీ ఇక్కడే ఉన్న బండారు శ్రీకాంత్ వర్గం…నర్సారెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుంది. పార్టీలు మారిన నాయకులకు ప్రాధాన్యం ఎలా ఇస్తారని, జిల్లా అధ్యక్ష పదవి నుంచి నర్సారెడ్డిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే నర్సారెడ్డి 2009లో గజ్వేల్ నుంచి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014లో ఓడిపోయిన నర్సారెడ్డి…ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. కానీ అక్కడ సరైన ప్రాధాన్యత దక్కడం లేదని చెప్పి, తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. అక్కడ నుంచి గజ్వేల్‌లో కాంగ్రెస్‌ని నడిపిస్తున్నారు. కానీ ఇలా పార్టీ మారి వచ్చిన నర్సారెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడంపై శ్రీకాంత్ వర్గం గుర్రుగా ఉంది. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని శ్రీకాంత్ చూస్తున్నారు. అయితే వీరి మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టకపోతే గజ్వేల్‌లో కాంగ్రెస్ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి…కేసీఆర్ కోటలో కాంగ్రెస్‌ని ఎలా సెట్ చేస్తారో చూడాలి.