40 ఏళ్ల పార్టీకి కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో అంతర్గత ఘర్షణలు చెలరేగుతున్నాయి.ఇక్కడ ఉంటే ఏం లాభం అని కొందరు టీడీపీ నాయకులు తెరవెనుక వైసీపీ నాయకులతో లాబీయింగ్ జరిపి బాగానే దండుకుంటున్నారు. రంగు టీడీపీది రూపం వైసీపీది అన్నది ఇప్పుడు వెలుగులో ఉన్న వాస్తవం. దీంతో ఎటు పోవాలో తెలియని వారంతా తటస్థులుగా ఉండిపోతున్నారు. ఆస్తులు కాపాడుకోవాలి అనుకున్నవారు, అంతస్తులు పెంచుకోవాలి అని అనుకున్నవారు మాత్రమే పాపం
రూటు మార్చి రాజకీయం చేస్తున్నారు.ఆ విధంగా మన తారక్ కూడా ఎప్పుడో రూటు మార్చేశాడని టీడీపీలో ఓ వర్గం కారాలూ మిరియాలూ నూరుతోంది.
ఇరవై ఏళ్ల కిందట ఆది సినిమా విడుదల సమయంలో కూడా తారక్ ను నందమూరి కుటుంబం ముఖ్యంగా బాలకృష్ణ చేరదీసింది లేదు. ఆ తరువాత కుటుంబ వేడుకల్లోనూ వీరికి ప్రాధాన్యం లేదు. దీంతో చాలా కాలం బాలయ్యకూ, తారక్ కూ దూరం ఉంటూనే వచ్చింది.కానీ ఇప్పుడు ఆ కుటుంబానికి ముఖ్యంగా పార్టీకి తారక్ అవసరం వచ్చింది. 2009లో ప్రచారానికి వచ్చి తరువాత మాయం అయిపోయాడు. కానీ ఇటీవల వివాదాల్లో భువనమ్మను చాలా కించపరిచి మాట్లాడారు వైసీపీ మనుషులు మరియు వల్లభనేని వంశీ కూడా! అప్పుడు కూడా తారక్ స్పందించలేదు. ఆఖరికి వైసీపీ నాయకులు భువనమ్మ కాళ్లు పట్టుకుంటాం అని అన్నారే కానీ ఆ మాట కూడా వంశీతో చెప్పించలేకపోయాడు తారక్.
ఇక తెరవెనుక కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి నాయకులు తారక్ కు అండగా ఉంటున్నారు. టికెట్ల ధరల మార్పు్ విషయమై కూడా కొడాలి నాని సాయం చేశారు అని కూడా అంటారు. ఆ విధంగా వైసీపీలో పెద్దలు చాలా మంది లోపాయికారిగా
తమ అవసరాలకు అనుగుణంగా అఖండ సినిమా విషయంలో బాలయ్యకు, ట్రిపుల్ ఆర్ విషయంలో తారక్ కు సాయం చేస్తూనే ఉన్నారు. ఇదంతా కాదు ఇవన్నీ పవన్ స్ట్రాటజీని అడ్డుకునేందుకు చేస్తున్న పనులు కావొచ్చు..లేదా టీడీపీ స్ట్రాటజీని అడ్డుకునే పనులు కూడా కావొచ్చు. ఆ విధంగా తారక్ కోవర్టులు వైసీపీలో ఉన్నారు. బాబు కోవర్టులు కూడా వైసీపీలోనే ఉన్నారు. ఆ మాటకు వస్తే బాబు కోవర్టులు బీజేపీలోనూ ఉన్నారు. కనుక ఉన్నట్టుండి లోకేశ్ ను కీలక బాధ్యతల నుంచి తప్పించి పార్టీ పగ్గాలు తారక్ కు అప్పగిస్తే కొడాలి నాని మరియు వల్లభనేని వంశీ లాంటి వారంతా తిరిగి పసుపు పార్టీ గూటికి చేరిపోతారు.
ఆ విధంగా కమ్మ సామాజిక వర్గ ప్రాధాన్య రాజకీయాలను మళ్లీ మళ్లీ ప్రోత్సహించి బలపడతారు.