అధికార పార్టీ అన్నాక వర్గపోరు సహజం.ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉంటాయి. అయితే ఈ తగాదాలు పార్టీకి ఇబ్బందిగా కూడా మారుతున్నాయి. ముఖ్యంగా కొత్త, పాత నాయకులు, కార్యకర్తల మధ్య ఎక్కువగా సమస్యలు ఉంటున్నాయట. ఇలాంటి గొడవే తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలోనూ మొదలైంది. కేటీఆర్ సొంత ఇలాకాలో టీఆర్ఎస్ నేతల విభేదాలు శృతి మించడంతో దీని పై పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోందట…
సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగలపల్లి మండల నేతలతో కేటీఆర్ ఇటీవలే భేటీ అయినట్టు తెలుస్తోంది. కొత్త, పాత నేతలు పాల్గొన్న ఆ సమావేశంలో నాయకుల అభిప్రాయాలను ఓపిగ్గా విన్నారట కేటీఆర్. సిరిసిల్లలో తోట ఆగయ్య, కొండూరు రవీందర్‌రావు మధ్య పంచాయితీ మొదలైందట. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్నవారిని కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారట. నియోజకవర్గంలోని మండలాల వారీగా దీనిపై సమావేశం అయ్యేందుకు టైం టేబుల్ సిద్ధం చేస్తున్నారట.
ఆయా మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపైనా కేటీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నా సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు పై పైనే మాట్లాడుతున్నారట. కేటీఆర్ ముందు మనసు విప్పి అసలు విషయం చెప్పలేకపోతున్నారట. ప్రధానంగా కొండూరు రవీందర్‌రావుపైనే పార్టీలోని ఓ వర్గం అసంతృప్తితో ఉందట. మధ్యలో పార్టీలోకి వచ్చిన ఆయన లేని పెత్తనం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్న పాత తరం నేతలు ఫైర్ అవుతున్నారట. అయితే సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నది అధికార పార్టీ నాయకులు చెప్పేమాట.
పైకి మాత్రం ఈ సమావేశాలన్నీ అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగమేనని చెబుతున్నారు. లోలోపల నాయకుల మధ్య ఉన్న వర్గపోరును మాత్రం ఆదిలోనే తుంచేసే ప్లాన్ చేస్తున్నరట కేటీఆర్. సిరిసిల్ల టీఆర్‌ఎస్ విషయంలో పార్టీలోని వారి వాదన ఎలా ఉన్నా.. ఈ సమస్యను కేటీఆర్ డీల్ చేస్తున్న విధానంపై పార్టీ నేతలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారట.