రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తిదాయక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆసక్తికర పరిణామాలకు ఆనవాలు ఇచ్చే విధంగా నాయకుల ప్రవర్తనలూ మరియు ప్రకటనలూ ఉంటున్నాయి. ఆ విధంగా వైఎస్సార్ భక్తుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంచి ఆఫర్ వచ్చింది. అప్పట్లో జగన్ వెంట నడిచి ఖమ్మం ఎంపీగా కూడా ఎన్నికైన ఏకైక నాయకుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ వైఎస్ కుటుంబ విధేయుడు ఆయనే ! టీఆర్ఎస్ గూటిలో ఉన్నా కూడా ఆయనకు ఎందుకనో పెద్దగా ఇప్పటి రాజకీయాలు ఇష్టం లేకుండా ఉన్నాయనే తెలుస్తోంది.
అందుకే ఆయన ప్రస్తుత సమయంలో తనకు రాజ్యసభ పదవి ఇచ్చినా పోయేందుకు సిద్ధంగా లేరని ప్రముఖ మీడియాలు కథనాలను ప్రసారితం చేస్తూ ఉన్నాయి. 2014లో మంచి హవాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నడిపిన పొంగులేటి తరువాత కాలంలో జగన్ తన పార్టీని తెలంగాణలో వైండప్ చేశాక సైలెంట్ అయిపోయారు. ఆ మధ్య వైఎస్సార్టీపీ ఏర్పాటు అయ్యాక షర్మిల వెంట నడుస్తారని అనుకున్నారంతా ! కానీ అదంతా అబద్ధమేనని తేలిపోయింది. ఓ విధంగా వైసీపీ తన కార్యకలాపాలను తెలంగాణ కేంద్రంగా నిలుపుదల చేయడమే పొంగులేటి రాజకీయ ఎదుగులకు పెద్ద ప్రతికూల పరిణామం అన్నది చెప్పక తప్పదు!
ఇక రెండంటే రెండు సీట్లు ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరికొన్ని పేర్లు కూడా వినిపించాయి. అందులో ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు పేరు కూడా వినిపించింది. ఈయన కూడా ఉమ్మడి కమ్మం జిల్లా నేత కావడం విశేషం. కానీ కేసీఆర్ మాత్రం ఈయన విషయమై సుముఖంగా లేరనే తెలుస్తోంది. ఇంకా కొందరు విధేయులు ఉన్నారు.
వీరిలో మరో జగన్ విధేయుడు, అక్రమాస్తుల కేసులో నిందితుడు హెటిరో డ్రగ్స్ అధినేత పార్థ సారథికి కూడా టికెట్ ఖాయం అన్న ప్రచారం సాగినా ఆఖరికి అది కూడా సాధ్యం కాదనే తేలిపోయింది. మొత్తమ్మీద ఇవాళ కేసీఆర్ చుట్టూ ఉన్న నాయకుల్లో అయితే జగన్ విధేయులు లేదంటే బాబు విధేయులు ఇంకా చెప్పాలంటే వైఎస్సార్ విధేయులు కూడా ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం కమ్మ సామాజికవర్గంకు చెందిన నేతకు ఈ సారి రాజ్యసభ అవకాశం ఇవ్వకపోవచ్చు.