– ఏం తేల్చనుందోనని సర్వత్రా ఉత్కంఠ
– మరో వైపు ఢిల్లీ సరిహద్దులో ఉధృతంగా కొనసాగుతున్న రైతు ఆందోళనలు
న్యూఢిల్లీః కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఇదివరకూ పలు మార్లు రైతులకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. కేంద్ర మొండి వైఖరి, పట్టువదలని అన్నదాతల ఆందోళనల క్రమంలో పరిస్థితుల్లో మార్పు రాలేదు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలపై అత్యున్నత న్యాయస్థానం నేడు (సోమవారం) విచారణ జరపనుంది. రైతు ఆందోళనలతో పాటు కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై కూడా పలు పిటిషన్లు నమోదయ్యాయి. వీటిపై కూడా సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే, ఇప్పటికే రైతులు,కేంద్రం మధ్య ఎనిమిది సార్లు చర్చలు జరిగినప్పటికీ అవి విజయవంతం కాలేదు. ఇలాంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు రావడం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. న్యాయస్థానం ఏం చెప్పనుందోనని రైతుల్లోనూ ఉత్కంఠ నెలకొన్నది.
కాగా, ఇదివరకు జరిగిన రైతులు, కేంద్రం మధ్య చర్చలు సఫలం కాని తరుణంలో ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించటం లేదని ఈ నెల 6న జరిపిన విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైతులు, ప్రభుత్వం మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని అటార్నీ జనరల్ కే.కే. వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. రైతు ఆందోళనలు, వ్యవసాయ చట్టాపై నమోదైన పిటిషన్లపై ఇప్పుడే తమ స్పందన తెలియజేస్తే జరగబోయే చర్చలు దెబ్బతినే అవకాశముందని అన్నారు.
ఈ క్రమంలోనే నేడు (సోమవారం) జరిగే సుప్రీంకోర్టు విచారణపై ఇటు అన్నదాతలు, అటు కేంద్రంలో ఉత్కంఠ నెలకొన్నది. అత్యున్నత న్యాయస్థానం ఏం తేల్చనుందో త్వరలోనే తెలియనుంది.