ఆరేళ్ల కిందట ఓ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అల్లకల్లోలం సృష్టించింది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత ఇది కాస్త మరుగున పడింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. నిన్న ఈడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టీడీపీకి కాస్త ఊరటనిచ్చే విషయంగా ఉంది.
తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేత బేరసారాలు సాగించారనేది ప్రధాన ఆరోపణ. చంద్రబాబు ఫోన్లో మాట్లాడుతూ మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి.
అప్పటి నుంచి వైసీపీ ఇదే విషయాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తోంది. అయితే నిన్న ఈడీ ఈ కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డిపై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాంతో పాటు ఎంపీ రేవంత్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు కూడా నమోదు చేసింది ఈడీ. కానీ చార్జ్‌షీట్‌లో ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరు కనిపించలేదు. స్టీఫెన్‌సన్ తో బేరసారాలు జరిపినట్టు ఎంపీ రేవంత్‌పై కేసు నమోదు చేసింది. కానీ చంద్రబాబుపై వచ్చిన అభియోగాల్లో ఏ ఒక్కటీ అందులో లేకపోవడంతో టీడీపీ నేతలు తెగ సంబురాలు చేసుకుంటున్నారు.