శ్రీకాకుళం జిల్లా నేతలు బాబాయ్, అబ్బాయి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే మాట వాస్తవం. ఏపీ టీడీపీ అధ్యక్షునిగా కింజరావు అచ్చెన్నాయుడు కొనసాగుతుండగా…. శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ఏపీ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసుకున్నారు. అటు పార్టీలో కూడా వీరిద్దరికీ ఎదురులేదనే మాట బహిరంగ రహస్యం. వీరిద్దరికి జిల్లాలో బలమైన క్యాడర్ కూడా అండగా ఉంది. అయితీ ఇటీవల జరిగిన పరిణామాలు ఇద్దరి ఎన్నికపైన అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపు సిక్కోలు టీడీపీ నేతల్లో కుంపట్లకు కారణమైంది. శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి గుండ లక్ష్మీదేవిని కాదని… గోండు శంకర్‌కు కేటాయించారు చంద్రబాబు. అలాగే పాతపట్నం నుంచి కలమట వెంకటరమణను పక్కన పెట్టిన అధిష్ఠానం… అతని స్థానంలో మామిడి గోవిందరావును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈ ఇద్దరు మాజీలు పార్టీ పెద్దలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గుండ లక్ష్మీదేవి ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయినప్పటికీ… కలమట మాత్రం తన వర్గం అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
అయితే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల మార్పు లేదని ఇప్పటికే చంద్రబాబు తేల్చిచెప్పేశారు. దీంతో అటు గుండ, ఇటు కలమట వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఈ ఇద్దరు నేతలు కూడా తమకు టికెట్ రాకుండా అడ్డుకుంది కింజరాపు అచ్చెన్నాయుడే అని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో కింజరావు కుటుంబ ఆధిపత్యానికి బ్రేక్ వేయాలని ఇద్దరు నేతలు భావిస్తున్నారు.
శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి గుండ లక్ష్మీదేవి, పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ పెద్దలకు కూడా తేల్చి చెప్పేశారు. అదే సమయంలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారయణ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అటు టెక్కలి నియోజకవర్గంలో దాదాపు 15 మందితో నామినేషన్లు వేయించేందుకు కలమట ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఓట్లు చీలుతాయని.. పరోక్షంగా అచ్చెన్నాయుడు ఓడిపోతాడనేది కలమట వర్గం మాట. ఇలా అటు బాబాయికి, ఇటు అబ్బాయికి చెక్ పెట్టాలనేది అసంతృప్త నేతల ఆలోచన. మరి లీడర్ల రివెంజ్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.