టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కుమారుడు, టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణకు తన సొంత నియోజకవర్గం హిందూపురంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తు న్నాయి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తమకు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. ప్రజలు బాలకృష్ణపై నమ్మకం పెట్టుకుని గెలిపించినా ఆయన మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎన్నికలు జరిగిన ఆరునెలల్లో ఎమ్మెల్యే నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం మానేశారు. ఈ నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే ఇక్కడికి వచ్చారు. నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై ఏమాత్రం పట్టింపులేనట్లుగా వదిలేశారు.
అసెంబ్లీ సమావేశాలకే కాకుండా జిల్లా కేంద్రంలో నియోజకవర్గాల అభివృద్ధిపై జరిగిన మూడు సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ హాజరై తమ వాణిని వినిపించారు. అయితే బాలయ్య మాత్రం సమావేశాలకు డుమ్మా కొట్టారు. ఆయన అసెంబ్లీ, అధికార సమావేశాలకు హాజరుకాకపోవడంతో అధికారులతో పాటు ప్రజల్లో కూడా తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఆయన నియోజకవర్గం బాధ్యతలను పీఏలకు అప్పగించడం, గతంలో తీవ్ర వివాదానికి కారణమైంది.
ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే హోదాలో నియోజవకవర్గానికి ఆయన వచ్చిన తేదీలు వేళ్లపై లెక్కించవచ్చు. వచ్చినప్పుడల్లా మండలాల్లో ప్రారంభోత్సవాలు, భూమి పూజలు, రోడ్డుషోలతో సరిపెట్టేశారు. ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో సతీసమే తంగా హిందూపురంలో ఇంటింటి ప్రచారాలు చేశారే తప్ప ఆ తర్వాత కనిపించలేదు. దీంతో ప్రజలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నారన్న సంగతి మరిచిపోయే పరిస్థితి నెలకుంది.
అధికార కార్యక్రమాలే కాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా రావడంలేకపోవడంతో ప్రజలకే కాకుండా ఆపార్టీ కార్యకర్తల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొంది. పైగా ఆయన సినిమాల్లో బిజీగా ఉండడంతో ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. మరి ఈ సమస్యలపై బాలయ్య ఎప్పటికి స్పందిస్తారో చూడాలి. రాష్ట్రంలో టీడీపీది ఒక బాధైతే.. హిందూపురంలో మరో బాధ అనే రీతిగా ఉందని అంటున్నారు.