వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఢిల్లీకి జగన్ దేనికోసం!

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి..ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటనపై రకరకాల చర్చలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ వర్షన్ ఒకలా ఉంది..టీడీపీ వర్షన్ మరొకలా ఉంది. ముందు వైసీపీ వర్షన్ చూసుకుంటే..విభజన హామీల అమలు, పోలవరం నిధులు, వెనుకబడిన జిల్లా నిధులు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడానికి జగన్..మోదీని కలవడానికి వెళుతున్నారని అంటున్నారు.

కానీ ఇందులో టీడీపీ వర్షన్ వేరుగా ఉంది. జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో కదలిక వచ్చిన ప్రతిసారీ జగన్ ఢిల్లీకి వెళుతున్నారని చెబుతున్నారు. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై జగన్‌ చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.

అది టీడీపీ వర్షన్ గా ఉంది. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం..పోలవరం ప్రాజెక్టుకు 2017-18 అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధానిని సీఎం కోరతారని తెలిపాయి. అలాగే ఎఫ్‌ఆర్‌బీఏం పరిమితిని పెంచాలని.. వచ్చే మార్చిలోపు మరో రూ.20 వేల కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు కల్పించాలని కూడా అభ్యర్థిస్తారని చెబుతున్నాయి.

ఇలా జగన్..ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని కలిసే అంశంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళిన జగన్..మోదీతో భేటీ అయ్యాక..ఆ విషయాల గురించి మీడియాతో మాట్లాడిన సందర్భం లేదు. మరి జగన్ ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడుతారో..ఆయనకే తెలియాలి. ఇప్పటికే రాష్ట్ర ఆర్ధిక పరిస్తితిపై కేంద్రానికి ఓ అవగాహన ఉంది. ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రి..ఓ రాష్ట్రం జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని కామెంట్ చేశారు. ఏపీని ఉద్దేశించే ఆర్ధిక మంత్రి మాట్లాడారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళుతున్న జగన్..రాష్ట్రానికి నిధులు ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version