ఎంపీ టికెట్‌ కోసం తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల క్యూ

-

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ రసవత్తరంగా మారింది.కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.జిల్లాలో12 స్థానాలకు గానూ 11 స్థానాలను కైవసం చేసుకుని పూర్వవైభవాన్ని చాటుకుంది. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌కు రాజకీయ ఉద్దండులు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.కాగా జిల్లాలోని ఎంపీ సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ దూకుడు పెంచింది.

నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల నుంచి అధికార కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడానికి భారీగా ఆశావహులు ఆసక్తి చూపిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఆశావహుల పేర్లను సీల్డ్‌ కవర్‌లో పీసీసీకి పంపారు. నల్గొండతో పోలిస్తే భువనగిరి స్థానానికి భారీ ఎత్తున ఆశావహులు ఉన్నారు. భువనగిరి ఎంపీ స్థానానికి ఒక్క యాదాద్రి జిల్లా డీసీసీ నుంచే ఆరు పేర్లు వినిపిస్తున్నాయి.సూర్యాపేట నుంచి మరో నాలుగుపేర్లను పీసీసీకి కవర్లో పంపారు ఆ పార్టీ నేతలు.

నల్గొండ పార్లమెంటు స్థానానికి మాజీ మంత్రి, సీనియర్‌ నేత జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు రఘువీర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబంలో ఒకరి పేరు వినిపిస్తోంది.గత ఎన్నికల్లో సూర్యాపేట నుంచి టిక్కెట్‌ ఆశించిన పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్‌ రమేశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ లు కూడా ఆశావహులుగా ఉన్నారు. భువనగిరి ఎంపీ స్థానానికి.. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కొడుకు సర్వోత్తమ్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబానికి చెందిన మరొకరు రేసులో ఉన్నారు.

సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి కూతురు కీర్తిరెడ్డి, ఆలేరు నియోజకవర్గానికి చెందిన ఎల్లెంల సంజీవరెడ్డితో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, జనగామ జిల్లాలకు చెందిన మరో నలుగురి నాయకుల పేర్లను పీసీసీకి పంపారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యంగా కనిపిస్తోంది.జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో నాయకుడి ప్రభావంలో కనీసం రెండు నియోజకవర్గాలు ఉంటూ వచ్చాయి. జానారెడ్డికి నాగార్జున సాగర్‌తో పాటు మిర్యాలగూడ, దేవరకొండలపై పట్టు ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్..

మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సూర్యాపేటతో పాటు తుంగతుర్తి నియోజకవర్గాల్లో పట్టు సాధించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు అసెంబ్లీ స్థానాలపై పట్టు ఉంది.రెడ్డి సామాజిక వర్గానికి ఆధిపత్యం కొనసాగుతున్నా ఈ సారి బీసీ నేతలు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు.నల్గొండ పరిధిలో సూర్యాపేట, భువనగిరి పరిధిలో జనగామ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా ఉండటంతో టిక్కెట్‌ వస్తే గెలుపు ఖాయమన్న అభిప్రాయం నేతల్లో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. దీంతో ఇక్కడి నుంచి పోటీకి పలువురు సీనియర్లు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టిక్కెట్లను ఎవరికి కేటాయిస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version