జగన్ తీసుకునే నిర్ణయాలు చాలా చిత్రంగా ఉంటున్నాయని అంటున్నారు మంత్రులు. కొందరు తమకు ఇష్టం ఉన్నా. లేకున్నా కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలకు తలొగ్గాల్సి వస్తోందట. తాజగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మండలి కూడా ప్రారంభం కానుంది. ఉభయ సభల్లోనూ వైసీపీ దూకుడు ప్రదర్శించాలని అనుకుంటోంది. అయితే మండలిలో ఆశించిన మేరకు మెజారిటీ లేదు. దీంతో ఒకింత దూకుడు తగ్గినా.. అసెంబ్లీలో మాత్రం దూకుడు మామూలుగా లేదని చెబుతున్నారు.
ఇదిలావుంటే, అసెంబ్లీలో అధికార పక్షం బాగానే ఉందికనుక.. ఇక్కడ ఏదైనా లోటు పాట్లుంటే.. సరిచేసుకు నేందుకు చాలా యంత్రాంగమే ఉంది. కానీ, మండలిలో మాత్రం అలాకాదు. నిన్న మొన్నటి వరకు మండలిని నడిపించడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఇద్దరూ కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో ఇక్కడ బాగా లోటు కనిపిస్తోంది. మరోపక్క, ప్రతిపక్షం టీడీపీ మాత్రం అనేక అస్త్రాలతో రెడీ అయింది. ఈ క్రమంలో టీడీపీని నిలువరించాలంటే వైసీపీకి కత్తిలాంటి నేతలు అవసరం.
ఈ క్రమంలోనే జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే మండలి పక్ష మంత్రిగా ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి పగ్గాలు అప్పగించారు. వాస్తవానికి ఆయన తనకు ఈ బాధ్యత వద్దని వెంటనే స్పష్టం చేసినట్టు తెలిసింది. అంతేకాదు, పక్కనే ఉన్న మరో మంత్రి బొత్స సత్యనారాయణ సదరు బాధ్యతను అప్పగిస్తే.. వెంటనే భుజాన వేసుకోవాలని అనుకున్నారట కానీ, జగన్ మాత్రం మండలిలో వైసీపీని గట్టెక్కించే బాధ్యతను మంత్రి బుగ్గనకు అప్పగించేసి వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయారట.
అంతే! బుగ్గన తల పట్టుకుని నాకెందుకీ సంత! అనే శారట!! ఇంతలో అక్కడకు వచ్చిన రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. కొన్ని నిర్ణయాలు అంతే అలాగే ఉంటాయి. అయితే నీకు ఇబ్బంది లేదులే! అంతా సత్తెన్న చూసుకుంటారు! అని ముక్తాయించారట. ప్రస్తుతం ఈ విషయం వైసీపీ వర్గాల్లో ఆఫ్ ది రికార్డుగా హల్చల్ చేస్తుండడం గమనార్హం.