తెలుగుదేశం పార్టీ సీట్ల కేటాయింపు ఇప్పుడు ఆ పార్టీకే తలనొప్పిగా మారింది. పొత్తులో భాగంగా 31 నియోజకవర్గాలను జనసేన, బీజేపీలకు టీడీపీ కేటాయించింది. ముందుగా ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ… మెల్లగా అధినేత బుజ్జగింపులతో పాటు… పదవులిస్తామంటూ హామీలివ్వడంతో… వారంతా మెత్తబడ్డారు. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు టికెట్లు దక్కించుకోవడంతో… సీనియర్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే… ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు కూడా.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రాంగం వల్ల శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతలకు అన్యాయం జరిగిందనే మాట బహిరంగ రహస్యం. ప్రధానంగా శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో సీనియర్లను కాదని… ద్వితీయ శ్రేణి నేతలకు టికెట్లు దక్కాయి. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవిని కాదని… గొండు శంకర్‌కు, పాతపట్నంలో కలమట వెంకటరమణకు బదులుగా మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించారు. దీంతో… అటు గుండ, ఇటు కలమట వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుండ వర్గం అయితే ఏకంగా టీడీపీ జెండాలు తగులబెట్టింది కూడా.
తమ అభిమానులు, కార్యకర్తలతో సమావేశమైన గుండ దంపతులు… రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించారు. అటు కలమట వెంకటరమణ వర్గం సైతం అచ్చెన్నాయుడు పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే టెక్కలి నియోజకవర్గంలో దాదాపు 20 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా చేయడం వల్ల… టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా ప్రచారం చేయవచ్చని… అలాగే అచ్చెన్న ఓట్లు టార్గెట్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే… రాబోయే ఎన్నికల్లో బాబాయ్, అబ్బాయ్ ఓడిపోవడం దాదాపు ఖాయమే అంటున్నారు.