తిరుపతి కార్పొరేషన్ పై పట్టుకోసం కూటమిలో పార్టీల సిగపట్లు… జంప్ అయ్యేందుకు కార్పొరేటర్లు రెడీ

-

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న వైజాగ్ మునిసిపల్ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత మేయర్ పై త్వరలోనే అవిశ్వాసం పెట్టనున్నారు జంపైన కార్పొరేటర్లు. ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్ లోను ఇవే పరిస్థితులు కనిపించబోతున్నాయి. ఎన్నికల ముందు దాకా తిరుపతిలో ఒకే పార్టీది ఆధిపత్యం. కానీ ఇప్పుడు సీన్ మారింది. 50 డివిజన్‎లు ఉన్న తిరుపతి కార్పొరేషన్‎కు 3 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీని వైసీపీ సొంతం చేసుకుంది. 49 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 48 స్థానాల్లో వైసీపీ గెలవగా ఒక్క డివిజన్ లోనే టిడిపి జెండా ఎగిరింది. మేయర్‎గా శిరీష, డిప్యూటీ మేయర్లు‎గా భూమన అభినయ్, ముద్దుల నారాయణ ఎన్నిక అయ్యారు.

2024 ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన 5 మంది కార్పొరేటర్లు పార్టీ మారారు. ఇద్దరు టిడిపిలోకి, ముగ్గురు జనసేనలోకి చేరిపోయారు. ఇక ఫలితాల తర్వాత ఇప్పుడు జంపింగ్‎కు కార్పొరేటర్లు ఆసక్తి చూపుతున్నారు. మేయర్ శిరీష ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా డిప్యూటీ మేయర్ నారాయణతో పాటు పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎవరిపాటికి వారు ప్రయత్నం చేసుకుంటున్నారు. జనసేనలోకి జంప్ చేయాలా, లేదంటే టిడిపిలో చేరాలా అని గ్రూపులుగా చర్చించుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో సొంత పార్టీ నిర్ణయాలను తప్పుపడుతూ వైసిపి కార్పొరేటర్లు సొంత పార్టీ నిర్ణయాలను తప్పుబడుతూ మాట్లాడారు. దీంతో వారు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారనే సంకేతాలు ఇచ్చారు. అటు భూమన దగ్గర ఉన్న కార్పొరేటర్లు సైతం టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం.

తిరుపతి కార్పొరేషన్‎పై టిడిపి, జనసేన పార్టీలు పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎక్కువ మంది కార్పొరేటర్లను జనసేనలోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిసింది. సినీ నిర్మాత ఒకరు ఈ వ్యవహారంలో కీలకంగా మారారని టాక్ నడుస్తోంది. అయితే మరోవైపు తిరుపతి కార్పొరేషన్ టిడిపి సొంతం కావాలన్న గట్టి ప్రయత్నమే సాగుతోంది. మేయర్ స్థానాన్ని ఆశిస్తున్న అన్నా రామచంద్రయ్య, కార్పొరేటర్లు అయిన తన ఇద్దరు కూతుర్లతో కలిసి టిడిపి కండువా కప్పుకోవడం దీనికి సంకేతమంటున్నారు. అయితే వైసీపీ కార్పొరేటర్లకు ఏ పార్టీకి జై కొట్టాలో అర్థం కావడం లేదు. టీడీపీ, జనసేనలు కూటమిలో పార్టీలే అయినా స్థానిక నేతలు ఎవరికి వారు తిరుపతి కార్పొరేషన్ పై ఆధిపత్యం సాధించాలని ప్రయత్నించడమే దీనికి కారణం. ఇలా తిరుపతి వైసీపీ కార్పొరేటర్ల భవితవ్యం ఏ పార్టీతో ముడిపడి ఉందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కూటమిలోని రెండు పార్టీల అధినేతల నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోయినా స్థానిక నాయకులు మాత్రం ముందస్తుగా పవర్ పాలిటిక్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version