ట్రెండ్ ఇన్ : ఆంధ్రాకు మరో ప్రశాంత్ కిశోర్ !

-

భాష సంస్కృతితో పాటు స్థానిక విధివిధానాల నిర్ణ‌యం నిర్దేశం అన్న‌వి ఇవాళ రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ధాన భూమిక పోషించే విష‌యాలు.వీటిపై శ్ర‌ద్ధ వ‌హించి మాట్లాడాల్సిన త‌రుణం వ‌చ్చేసింది.అందుకు ప్ర‌శాంత్ కిశోర్ స్థానంలో బీజేపీకి మ‌రో సార‌థి దొరికారు. ఆయ‌నే స‌త్య‌కుమార్. ఇప్ప‌టి వ్యూహ‌క‌ర్త.

ఆయ‌న రాక‌తో ఏమ‌యినా మార్పులు వ‌స్తాయా? బీజేపీ నాయ‌కులు వాడే భాష ఏమ‌యినా మారుతుందా? తెలుగు వారి సంస్కృతిని ప‌రివ్యాప్తం చేసే క్ర‌మంలో కానీ కార్యాచ‌ర‌ణ‌లో కానీ ఏమ‌యినా ప్ర‌భావం ఉంటుందా? ఎందుకంటే తెలంగాణ ఉద్య‌మం అంతా త‌రువాత ప‌రిణామాలు అన్నీ కూడా భాష చుట్టూ తిరిగాయి.. సంస్కృతి చుట్టూ తిరిగాయి.కానీ ఇవాళ బీజేపీ భాష పెద్ద‌గా గుర్తించ‌ద‌గ్గ స్థితిలో లేదు.అలానే తెలుగు వారి సంస్కృతికి చెడు తెచ్చే ప‌నుల‌ను అడ్డుకునే చ‌ర్య‌లు కూడా పెద్ద‌గా లేవు. పైకి మాట‌లు చెప్పి బీజేపీ చేత‌లు విస్మ‌రిస్తోంది. అందుకే తాజాగా సీన్లోకి వ‌చ్చిన స‌త్య‌కుమార్ లాంటి వ్యూహ‌క‌ర్త‌లు ఇవాళ క‌డప కేంద్రంగా రాయ‌ల‌సీమ ర‌ణ‌భేరి పేరిట స‌భ నిర్వ‌హిస్తున్నారు.ఈ సంద‌ర్భం త‌రువాత అయినా బీజేపీ (ఏపీ విభాగం) స్ట్రాట‌జీ ఏ విధంగా మార‌నుందో అన్న‌ది చూడాలిక‌.

బీజేపీకి మంచి రోజులు వ‌చ్చేశాయి అని అంతా భావించాలి. ఎందుకంటే యూపీలో అనూహ్య విజ‌యం ద‌క్కించుకున్నాక ఆంధ్రాలో కూడా పాగా వేయాల‌ని చూస్తోంది.ఓ రాజ‌కీయ పార్టీ హోదాలో బీజేపీ ఇలాంటివి ఆశించడంలో త‌ప్పు లేదు కానీ సాధ్యం అవుతుందా లేదా అన్న‌దే ఓ సందేహం.నిన్న‌టి వేళ బీజేపీ న‌గ‌ర కార్యాల‌యాల్లో భాగ్య‌న‌గ‌ర కేంద్రంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాల‌యాల్లో అమితోత్సాహంగా హోలీ వేడుకలు సాగాయి.కార్య‌క‌ర్త‌లు తీన్మార్ డ‌ప్పుల మోత‌కు స్టెప్పులు వేశారు. ఎన్న‌డూ లేనంత‌గా భాగ్య‌న‌గ‌రి బీజేపీ కార్యాల‌యాల్లోనూ, నాయ‌కుల ఇళ్ల ద‌గ్గ‌ర కూడా హోలీ వేడుక‌లు ఇంత ఘ‌నంగా జ‌ర‌గ‌డానికి కార‌ణం యూపీ లో యోగి గెలుపు. అంతేకాదు హోలీ వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈ సారి భారీ స్థాయిలో ఖ‌ర్చు చేశారంటే కార‌ణం ప్ర‌జ‌లను మ‌రింత‌గా ఆక‌ర్షించ‌డంలో భాగ‌మే! ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర స‌మితి ఏ విధంగా అయితే ప్రాంతీయ పండుగ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చి వాటికో ప్రాచుర్యం ద‌క్కిస్తుందో బీజేపీ కూడా జాతీయ పండుగ‌ల‌ను మ‌రింత భారీ స్ధాయిలో నిర్వ‌హించి త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను త‌మవైపు చూసేలా చేస్తోంది.ఇదేం త‌ప్పు కాక‌పోయినా రాజ‌కీయ పార్టీలు సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను కూడా త‌మ‌కు అనుగుణంగా మ‌లుచుకోవ‌డం ఇప్ప‌టి అల‌వాటు.

ఉద్య‌మంలో ఓ భావోద్వేగ వేడుక‌గా బ‌తుక‌మ్మ సాగింది. ఇప్పుడు కూడా అదే రీతిన నడుస్తోంది.అదేవిధంగా బీజేపీ కూడా హోలీ వేడుక‌ల‌ను జాతికి సంబంధించిన స‌మ‌గ్ర‌త‌కు ప్ర‌తీక‌గా భావిస్తూ నిన్న‌టి వేళ ఎంతో వైభ‌వంగా వేడుక‌లు నిర్వ‌హించి అంద‌రినీ ఆలోచింప‌జేసింది.ఓ విధంగా బీజేపీ క‌న్నా టీఆర్ఎస్ మాత్ర‌మే ప్రాంతీయ స్పృహ‌ను, పండుగ‌ల‌నూ ముందుకు తీసుకుని వెళ్ల‌డంలో ముందుంది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ను చూసి ఇత‌ర పార్టీలు కూడా త‌మ లోగిళ్ల‌లో పండుగ‌ల‌కూ సంబంధిత వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌కు మంచి ప్రాధాన్యం ఇవ్వ‌డం ఓ విధంగా శుభ‌ప‌రిణామ‌మే! ఏ విధంగా చూసినా ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌ను ఎన్నో విష‌యాలు ప్ర‌భావితం చేస్తాయి. భాష మ‌రియు సంస్కృతి అన్న‌వి ఇవాళ పార్టీల న‌డ‌వ‌డిని విపరీతంగా ఆక‌ర్షిస్తున్నాయి.

ఈ త‌రుణంలో భాష, సంస్కృతితో పాటు స్ధానిక విధివిధానాల నిర్ణ‌యం కూడా ఎంతో కీల‌కం అని భావించే బీజేపీకి కొత్త వ్యూహ‌క‌ర్త వ‌చ్చారు.ఆయ‌నే స‌త్య‌కుమార్.ఈయ‌న మొన్న‌టి వేళ యోగి వ్యూహ‌క‌ర్త.ఆయ‌న గెలుపున‌కు అహ‌ర‌హం కృషి చేసిన తెలుగు వాడు. రాయ‌ల సీమ ప్రాంత వాసి. గ‌తంలో ప్ర‌శాంత్ కిశోర్ ఏ విధంగా అయితే మోడీ వెంట ఉన్నారో ఈయ‌న కూడా అదే రీతిలో యోగి వెనుక ఉండి ఆయ‌నకు దిశానిర్దేశం చేశారు.ఇప్పుడీయ‌న ఏపీ రాజ‌కీయాల్లోనూ అడుగు పెడుతున్నారు.బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలో కీల‌క ప‌ద‌విలో ఉన్న స‌త్య‌కుమార్ రానున్న కాలంలో ఏపీ బీజేపీ వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దే మ‌రో ప్ర‌శాంత్ కిశోర్ లా మార‌నున్నారు.ఆ విధంగా ఆయ‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version