చిలికి చిలికి గాలివానలా మారిందన్నట్టుగా ఏపీలో ఎన్నికలు రక్తసిక్తంగా మారుతున్నాయి. చిన్న చిన్న గొడవలు కాస్త పెద్దగా మారుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. రాయలసీమలో అయితే ఎక్కడ చూసినా గొడవలు, రక్తపాతాలే.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అది తీవ్రంగా మారడంతో వేటకొడవళ్లు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో టీడీపీ నేత సిద్ధా భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్త పుల్లారెడ్డి చనిపోయారు. మరో నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇద్దరు కార్యకర్తలు చనిపోవడంతో అక్కడి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడ లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. వెంటనే అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.