అసెంబ్లీలో కేటీఆర్ విమర్శలకు గట్టిగా సమాధానవిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సభలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదన్న రేవంత్…. ప్రజాస్వామ్య స్పూర్తిగా కాంగ్రెస్ పనిచేస్తుందని తెలియజేశారు. కేటీఆర్ కు ప్రజాస్పూర్తిపై అవగాహన లేదని వ్యాఖ్యానించారు.గెలిచిన సీట్ల గురించి చెప్తూ 49 శాతానికి, 51 శాతానికి తేడా ఉంటుందని సెలవిచ్చారు. 51 శాతం వచ్చిన వారికే ప్రజాస్వామ్యంలో విలువ, అధికారం ఉంటుందని తెలియజెప్పారు. కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి అర్థం కాదని కేటీఆర్ పై సెటైర్ పేల్చారు రేవంత్.
గత పాలకుల గురించి ప్రస్థావిస్తూ ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడాలన్నారు. కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు.అసలు కేసీఆర్ రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించడంతో పాటు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చింది కూడా కాంగ్రెస్సేనని వెల్లడించారు.మరొకరి సీటు లాక్కుని కేటిఆర్ ఎమ్మెల్యే అయ్యారని విమర్శించారు.
రేవంత్ విమర్శలకు స్పందిస్తూ కేటిఆర్ మరోసారి వాగ్బాణాలు సంధించారు.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే వీలుందా అని ప్రశ్నించారు. ఎన్నారైలకు టికెట్ అమ్ముకున్నది ఎవరో చెప్పాలని కేటీఆర్… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని టార్గెట్ చేస్తూ ఆమె ఎన్నారై అంటూ రేవంత్ మాటలకు ధీటైన జవాబిచ్చారు. తెలంగాణ బలిదేవత ఎవరో అందరికీ తెలుసని.. బలిదానం, నియంతృత్వం గురించి కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదన్నారు.
మార్చి 17 కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుందని చెప్తూ చెప్పిన హామీలను అప్పటికి అమలు చేయకుంటే కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టేనని వ్యాఖ్యానించారు. తొలి క్యాబినెట్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పినట్లు గుర్తు చేస్తూ కేవలం రెండు గ్యారంటీలతో ప్రజలను ఊదరగొడుతున్నారని విమర్శించారు. సీఎం స్థానంలో ఉన్నప్పటికీ భాష మారడం లేదని విమర్శించారు. విద్యుత్ శాఖలో ఆస్తులు పెంచామని చివరికి స్పష్టం చేశారు.