అద్భుతమైన వ్యూహకర్తగా, ఆర్థిక సంస్కరణలను ప్రోత్సహించడంలో, వ్యాపారవేత్తలకు రాచబాట పరచడంలో, సంపద సృష్టికి అవకాశాలు కల్పించడంలో… మారుతున్న కాలానికి అనుగుణంగా మారే రాజకీయవేత్తగా… ఇలా ఎన్నో సానుకూలతలున్న చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకు విజయం కట్టబెట్టలేకపోయారు? ఆయన అసలు ఏమి ఆలోచిస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ప్రచార బాధ్యతలొక్కటే తీసుకుంటే సరిపోతుంది… నన్ను చూసి ఓటేస్తారని ఆయన భావిస్తున్నారా? తన చుట్టూ ఉన్న కోటరీ గోడలను బద్దలుకొట్టుకొని బయటపడదామనుకుంటున్నారా? భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? జగన్ ప్రభుత్వ వైఫల్యాలను కనీస మాత్రంగా కూడా ఉపయోగించుకోలేక ఆ పార్టీ ఎందుకు చతికిలపడింది? లాంటి ఎన్నో ప్రశ్నలు పార్టీ శ్రేణులనేకాదు.. ఓటేయకుండా తటస్తంగా ఉండిపోయినవారిని కూడా తొలిచేస్తున్నాయి.
వైసీపీ విజయఢంకా
ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల ఎన్నికల్లో చారిత్రక తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విజయాలు సాధించడంలో చరిత్ర సృష్టించే తెలుగుదేశం పార్టీ పరాజయాలు పొందడంలో కూడా అంతే చరిత్రను సృష్టించుకుంటోంది. ఫలితాలు వెలువడిన 11 కార్పొరేషన్లతో పాటు 75 మున్సిపాల్టీలకు 73 చోట్ల అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. మైదుకూరులో కూడా దాదాపుగా వైసీపీ గెలిచేసినట్లే. తాడిపత్రిలో చివరి వరకు ఏం జరుగుతుందో? చెప్పలేం. ఈ ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్పష్టత వచ్చింది.. పల్లె ఓటర్లేకాదు.. పట్టణ ఓటర్లు కూడా తనని పూర్తిగా నమ్మారని భావిస్తోంది. నమ్మనిదల్లా తెలుగుదేశం పార్టీనే. అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఓటర్లు గుర్తించలేదా? అనే సందేహం కలుగుతోంది.
ఓటర్ల ఆశలను పసిగట్టడంలో విఫలం
గ్రామీణ, నగర ప్రాంతాల ఓటర్లు ఇద్దరూ తెలుగుదేశం పార్టీపై పెట్టుకున్న ఆశలను ఆ పార్టీ పూర్తిగా చిదిమేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లగా మలుచుకోవడంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా విఫలమయ్యారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇసుక సమస్యకు ఇప్పటకీ పరిష్కారం దొరకలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు ఎవరూ తీర్చలేకపోతున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఆగిపోయింది. ఇళ్ల స్థలాలు అందరికీ పంపిణీ చేయలేదు. కొందరికి మాత్రమే అందాయి. రేషన్ డీలర్లలో వ్యతిరేకత ఉంది. డీఎస్సీ, గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. సంక్షేమ పథకాలు చాలా మందికి అందడంలేదు. ఇవేకాకుండా ప్రభుత్వ పాలనాపరంగా అనేక సమస్యలున్నాయి. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో టీడీపీ వైఫల్యం చెందింది. తెలుగుదేశం కాకుండా ప్రజలు వేరే ఏదైనా ప్రత్యామ్నాయం చూస్తున్నారా? అనుకుంటే అది కూడా లేదు. జనసేన, బీజేపీ కూటమి ఓటమి అంతకన్నా దారుణం. టీడీపీనీ నమ్మేలా పార్టీని తీర్చిదిద్దుతారా? ప్రత్యామ్నాయ శక్తిగా పుంజుకోవడానికి అవసరమైన టానిక్ పార్టీకి ఎక్కిస్తారా? అనేది ఇప్పడు చంద్రబాబునాయుడు తీసుకునే నిర్ణయంపై ఆధారపడివుంది.