ఏపీలో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు చాలా మంది చాలా రకాలుగా కృషి చేశారు. రాజకీయ నాయకుల నుంచి వ్యాపారవేత్తలు, సినిమా వాళ్లు, జగన్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో చాలా మందే ఉన్నారు. జగన్ కోసం కష్టపడిన సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇప్పుడు ఇలాంటి నేతలకు జగన్ కీలకమైన ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. రోజా లాంటి కీలక నేతకు మంత్రి పదవి లేకపోయినా కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక వాసిరెడ్డి పద్మకు కీలకమైన మహిళ కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. ఇక ఈ లిస్ట్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఒక్కరు మాత్రమే మిగిలిపోయారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె మీడియాలోనూ బయట పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించారు. చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా విమర్శలు చేశారు. లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు ఎంతైనా ప్రభావం మాత్రం నిజం. ఇక ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో లక్ష్మీపార్వతికి ఇప్పటికే పదవి రావాల్సి ఉండగా కాస్త లేట్ అయింది. నిన్నటికి నిన్న ఆమెకు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ పదవి పై అంబటి రాంబాబు కన్నేసినట్టు తెలుస్తోంది.
ఇక లక్ష్మీపార్వతికి సాహిత్య సంగీత కళా రంగాలలో విశేషమైన అనుభవం ఉంది. ఈ క్రమంలోనే ఆమెకు సాంస్కృతిక సలహాదారు లాంటి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లక్ష్మీపార్వతి సాహిత్య కళా రంగం నుంచే ఎన్టీఆర్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి ఆపై రాజకీయాల్లోకి వచ్చారు. అందువల్ల ఆమెను ఆ పదవికి ఎంపిక చేస్తే మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడానికి అవకాశం ఉంది. అయితే లక్ష్మీపార్వతికి ఎమ్మెల్సీ పదవి పై ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్ ఆమె మనసులో ఉన్న ఎమ్మెల్సీ పదవి ఇస్తాడా? లేదా ఇతరత్రా నామినేటెడ్ పదవి ఇస్తాడా? అన్నది చూడాల్సి ఉంది.