నందిగ్రామ్‌ లో పై చేయి ఎవరిది.. దీదీ ఎత్తుగడలు ఫలించాయా ?

-

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠభరితంగా ఎన్నిక సాగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది నందిగ్రామ్ ఒక్కటే. ఇక్కడే మమతాబెనర్జీ పోటీచేస్తున్నారు. బీజేపీ ఆశలు పెట్టుకున్న సుబేందు అధికారి సొంత నియోజకవర్గం నందిగ్రామ్. దశాబ్దాల వామపక్ష పాలన ముగిసి, మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో నందిగ్రామ్‌ పాత్ర కీలకం.14 ఏళ్ల తర్వాత మరోసారి ఈ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువైంది.

చాలా సంవత్సరాల పాటు మమతకు కుడిభుజంగా ఉన్న సుబేందు ఒక్కసారిగా ప్లేటు మార్చేసి బీజేపీలోకి ఫిరాయించారు.ఫిరాయించిన సుబేందు ఊరికే ఉండకుండా ధైర్యముంటే తనపై నందిగ్రామ్ లో పోటీచేసి గెలవాలంటు మమతకు సవాలు విసిరారు.అసలే మండిపోతున్న మమతకు సుబేందుకు విసిరిన సవాలు పుండుమీద కారం రాసినట్లయ్యింది. దాంతో చాలాకాలంగా పోటీచేస్తున్న భరత్ పూర్ నియోజకవర్గాన్ని కాదని మమత నందిగ్రామ్ లో పోటీకి దిగారు. పైగా నందిగ్రామ్ లో నామినేషన్ వేసి బహిరంగసభ నిర్వహించాల్సిన రోజే మమత కాలికి గాయమైంది. అప్పటినుండి నందిగ్రామ్ వైపే యావత్ దేశం చూస్తోంది.

మమత,సుబేందులో ఎవరు గెలిచినా బెంగాల్ చరిత్ర మొత్తం మారిపోవటం ఖాయం.ఒకవేళ నందిగ్రామ్ లో మమత ఓడిపోతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికే అవకాశాలు ఎక్కువున్నాయి.
దాంతో బిజెపికి అపూర్వమైన విజయం దక్కినట్లే. ఇదే సమయంలో సుబేందు అధికారి ఇక్కడ ఓడిపోతే బెంగాల్‌ లో అధికారం బిజెపికి అందే అవకాశాలు ఉండనట్టే..సుబేందు కుటుంబానికి నందిగ్రామ్ చుట్టుపక్కలున్న దాదాపు 40 నియోజకవర్గాల్లో మంచి పట్టుండటమే దీనికి కారణం.

ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలిచిన సువేందు అధికారికి 67.20 శాతం ఓట్లు లభించాయి. అంతేకాక నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానం ఉన్న తూర్పు మిడ్నపూర్‌ జిల్లాలో ఈయన కుటుంబానికి మంచి పలుకుబడి ఉంది. సువేందును స్థానికుడిగా, మమతా బెనర్జీ బయట నుంచి వచ్చిన నాయకురాలిగా బీజేపీ ప్రచారం చేస్తోంది. నిజానికి బెంగాల్లో మమతా బెనర్జీ రాజకీయ ఉత్థానం నందిగ్రామ్‌ నుంచే మొదలయ్యింది. 2011లో నందిగ్రామ్‌, సింగూరులో భూపోరాటం ద్వారా ఆమె 34 ఏళ్ల వామపక్ష పాలనను అంతం చేశారు.

అయితే నందిగ్రామ్ లో పోటీ చేయడం ద్వారా మమత పెద్ద రిస్కే చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు. సువేందు అధికారికి జంగల్ మహల్ లో ఎంత పట్టుందో మమత కంటే తెలిసిన వారు ఇంకొకరు లేరు. అన్నీ తెలిసీ ఆమె అక్కడే ఫోకస్ పెట్టాలనుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. సువేందు అధికారి జంగల్ మహల్ అంతా తిరగకుండా నందిగ్రామ్ కే పరిమితం చేయడానికి మమత ఈ ఎత్తు వేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version