ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నేపధ్యంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఇప్పుడు రాజకీయాన్ని ఏ మలుపులు తిప్పుతాయో అనే ఆసక్తిని పెంచేశాయి. రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఇప్పటికే,
జనసేన అధినేత పవన్ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఆయన లాంగ్ మార్చ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ స్వయంగా ఢిల్లీ విమానం ఎక్కడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆయన శనివారం బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాతో సమావేశం నిర్వహించారు. ఆదివార౦ హోం మంత్రి అమిత్ షాని కలిసే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇప్పటికే ఆయనకు కేంద్ర హోం శాఖ కార్యాలయం నుంచి అనుమతి కూడా వచ్చినట్టు సమాచారం. అమిత్ షా తో పవన్ భేటి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు ఏమైనా మారతాయా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. వాస్తవానికి పవన్ విషయంలో బిజెపి సానుకూలంగానే ఉంది. అందుకే పవన్ కూడా బిజెపిని పెద్దగా విమర్శించడం లేదు. దీనితో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.