ఫస్ట్ కాజ్ : 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. విశేష రీతిలో ఆయన సభకు స్పందన వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా, చోడవరంలో నిర్వహించిన సభ (మినీ మహానాడు పేరిట జరిగిన సభ) అపూర్వ ఆదరణను అందుకుంది. దీంతో చంద్రబాబు నాయుడు సహా మిగిలిన ఉత్తరాంధ్ర శ్రేణులంతా ఆనందోత్సాహాలతో ఉన్నారు.
ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల పరంగానే ఈ విశ్లేషణ చూద్దాం. శ్రీకాకుళంలో పది సీట్లు ఉన్నాయి. ఇందులో పాలకొండ ఎస్టీ రిజర్వుడు. రాజాం ఎస్సీ రిజర్వుడు. ఈ రెండు స్థానాలపై చంద్రబాబు కన్నేశారు. ఎందుకంటే గత రెండు పర్యాయాలు కాస్త కాదు చాలా అంటే చాలా కష్టం అవుతూనే ఉంది టీడీపీకి. విశ్వసరాయి కళావతి (పాలకొండ), కంబాల జోగులు ( రాజాం) వరుస విజయాలతో ఎమ్మెల్యేలుగా దూసుకుపోతున్నారు. ఇక్కడి వీరికి ప్రత్యామ్నాయంగా ఎదిగే నేతలు ఇంకా తయారు చేయడంలో టీడీపీ వెనుకబాటులో ఉంది. ఆ విధంగా వెనుకబాటుకు తార్కాణంగా నిలిచి, రాజకీయంగాఎటువంటి వృద్ధీ లేకుండా ఉంది. అదేవిధంగా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలలో నాలుగు స్థానాలు టీడీపీకి రావొచ్చు. మిగిలిన నాలుగు వైసీపీకి దక్కవచ్చు. పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన కలిసి పాతపట్నంలో పోటీచేస్తే ఇక్కడి అభ్యర్థి రెడ్డి శాంతి (సిట్టింగ్ ఎమ్మెల్యే, అత్యున్నత రీతిలో ఆర్థిక నేపథ్యం ఉన్న లీడర్, కాపు సామాజిక వర్గానికి చెందిన లీడర్) ఓడిపోవడం ఖాయం.
ఇదే విధంగా ఇక్కడ కాపుల డామినేషన్ ఎక్కువ. కనుక అంత వేగంగా టీడీపీ ఎదగడం జరగని పనే కావొచ్చు. కానీ రెడ్డి శాంతిపై వస్తున్న ఆరోపణలను తమకు అనుగుణంగా మలుచుకుంటే టీడీపీ గెలుపు ఖాయం కావొచ్చు. ఇక టెక్కలిలో మళ్లీ అచ్చెన్నే గెలుస్తారు. శ్రీకాకుళం లో మాత్రం టీడీపీ గెలుపు కష్టమే ! ఎందుకంటే ఇంటి పోరు విపరీతంగా ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా గుండ లక్ష్మీదేవి బరిలో ఉంటే మాత్రం కింజరాపు కుటుంబం నుంచి అందే సాయం అంతంత మాత్రమే కావొచ్చు అన్న పుకార్లు ఇప్పటినుంచే షికార్లు చేస్తున్నాయి.
పలాసలో కూడా సీదిరి గెలుపు గురించి అప్పుడే చెప్పలేం. ఇక్కడ గౌతు శిరీష (టీడీపీ) శక్తివంచన లేకుండా పాలకపక్షంపై పోరు బాట సాగిస్తున్నారు. ఎచ్చెర్లలో కూడా టీడీపీ గెలుపు కుదిరే అవకాశాలే ఉన్నాయి. ఇక్కడి ఎమ్మెల్యే గొర్లె కిరణ్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇచ్ఛాపురంలో టీడీపీ గెలవచ్చు. ఎందుకంటే ఇక్కడి వైసీపీ తీవ్ర ఇంటి పోరును చూస్తోంది. ఆమదాలవలసలో ఈ సారి వైసీపీ అభ్యర్థి ఎవ్వరైనా సరే కూన రవి గెలుపు సునాయాసం కావొచ్చు. ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ కు టికెట్ ఇవ్వరు. ఆయన భార్య వాణీ సీతారాం బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఆమే కనుక అభ్యర్థి అయితే కూన రవి సునాయాసంగా తన అక్కపై విజయం సాధించడం ఖాయం.
ఎందుకంటే ఇక్కడ కూడా వైసీపీకి ఇంటిపోరు ఉంది కనుక! ఇదేవిధంగా విజయనగరంలో కానీ విశాఖలో కానీ వైసీపీకి ఉన్న ఇంటి పోరు టీడీపీకి కలిసిరావొచ్చు. అదేవిధంగా టీడీపీ లో కుమ్ములాటలే పెరిగిపోతే వైసీపీ కి హాయిగా విజయ అవకాశాలు మెరుగు పడడం తరువాత స్థిరపడడం కావొచ్చు.