ప్రస్తుతం ప్లీనరీ సన్నాహాల్లో వైసీపీ ఉంది. నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీ నిర్వహించాక జిల్లా స్థాయిలో ప్లీనరీ నిర్వహించి, అటుపై గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి ప్లీనరీకి సిద్ధం అవుతోంది. జూలై ఎనిమిది, తొమ్మిది తేదీలలో ఈ ప్లీనరీ జరగనుంది. గతం కన్నా భిన్నంగా ప్లీనరీ నిర్వహణకు పార్టీ అధినాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్లీనరీ ఎందుకంటే అన్న ప్రశ్న నుంచి.. వీటి నిర్వహణకు ఉన్న ప్రాధాన్యం ఎంత అన్న ప్రశ్న వరకూ వైసీపీ నాయకులు ప్రజలకు ముఖ్యంగా కార్యకర్తలకు వివరించేందుకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు.
గతంలో గుంటూరు లో నిర్వహించిన రోజున తమకు అధికారం లేకపోయినా, ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టో రూపకల్పన చేసి, తద్వారా తమ పార్టీ సిద్ధాంతాలు, అధికారం దక్కాక చేపట్టబోయే పనులు అన్నింటినీ సమున్నతంగా వివరించగలిగాం అని, ఇప్పుడు రెండేళ్ల తరువాత కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యాన ఈ ప్లీనరీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు వైసీపీ నేతలు.
ఇంకా వైసీపీ ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థాయిలలో మాట్లాడుతూ..
“ఈ సమాజాన్ని మెరుగైన సమాజంగా రూపొందించేందుకు పనిచేసేదే రాజకీయ పార్టీ..ఇందులోభాగంగా అందరి క్షేమం కోరుకునే విధంగా పనిచేయాలి అంటే ఏం చేయాలి..? అన్న విషయమై అధ్యయనం చేశాం..అవినీతి లేని ప్రభుత్వం ఏర్పాటు చేయడం
ఓ వంతు..అందుకు తగ్గ వ్యవస్థను రూపొందించి అమలు చేయడం..మరో వంతు. అదే రీతిన గౌరవంగా అర్హత ఉన్న వారందరికీ సంక్షేమం అందేలా చేయడం.. బాధ్యత. సంక్షేమం అందుకోవడం అన్నది రాజ్యాంగం అందించిన గౌరవం అని భావించే విధంగా చేయడం..ఓ అధికార పార్టీ విధి. వీటన్నింటిపై విధానపర నిర్ణయాలు వెలువరించడం..అమలు చేయడం అన్నది ఇవాళ వైసీపీ పాటిస్తున్న ప్రథమ కర్తవ్యం..” అని వివరిస్తున్నారు.