వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సొమ్ముతో ఆదుకుంటామని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కుట్రల కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాయని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ది లేని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల తరుఫున పోరాడుతున్న న్యాయవాది రవిచంద్రన్‌ను సీఎం చంద్రబాబు, లోకేష్‌లు బెదిరిస్తున్నారని తెలిపారు.
మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘హాయ్‌లాండ్ ఆస్తులను కొట్టేయాలనే ఉద్దేశ్యంతోనే అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు. అందుకే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని 2017లోనే చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇంతవరకు దాని ఊసే లేదు. అగ్రిగోల్డ్‌పై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. దాని వెనుక ఉన్న వ్యక్తులెవరో బయటకు రావాలి. ఏపీపై ప్రజలకున్న ప్రేమను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాటకాలు అడుతున్నారు. రాజధాని తాత్కాలిక భవనాలకు వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ వర్షం వస్తే కురిసే విధంగా నిర్మాణం చేశారు. అలాంటి భవనాలకు కోట్లు ఖర్చు అవుతాయా? మాజీ సీఎస్‌లు లేవనెత్తిన ప్రశ్నలకు చీఫ్ సెక్రటరీతో జవాబు చెప్పించండి. చంద్రబాబు నీవు నిప్పు అని చెబుతుంటావు. నిజంగా నిప్పు అయితే నీపై విచారణ జరిపించుకో’’ అని అన్నారు.