ఏపీలో వైసీపీ నుంచి కొత్త అప్‌డేట్ ఒకటి బయటికి వచ్చింది. త్వరలోనే మాజీసీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారని టాక్ నడుస్తోంది.ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్‌రెడ్డి బహిరంగ సభలకు హజరవడమేకానీ నేరుగా ప్రజలతో ఎప్పుడూ ముచ్చటించింది లేదు.అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన మళ్ళీ జనంలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పుడూ లేనివిధంగా ముహూర్తాల కోసం ఎదురుచూస్తున్న జగన్.. శ్రావణమాసం మొదటివారం నుంచి నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. దీంతో వైసీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళ కాలంలో తీరిక లేకుండా గడిపారు. నిత్యం ఏదో ఒక రివ్యూ, సంక్షేమ పథకాల పంపిణీ,అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన వంటి అంశాలతో ఆయన బిజీగా ఉండేవారు. దీంతో ప్రజను నేరుగా కలిసేందుకు అసలు సమయం ఉండేది కాదు. ఏదైనా పథకాన్ని ప్రారంభించే సమయంలో బహిరంగ సభలకు వచ్చిన ఆయన ప్రజలనుద్దేశించి మట్లాడమే కానీ వారితో నేరుగా సమస్యలపై చర్చించింది లేదు. దీంతో కేడర్ కూడా కొంత నిరుత్సాహంగా ఉండేది. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినా అది ప్రచారానికి ఉపయోగపడింది కానీ ప్రజలతో తీరిగ్గా మాట్లాడేందుకు వీలు దొరక్కుండా పోయింది.
ప్రజాసంకల్పయాత్ర సమయంలో అన్ని వర్గాల ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యలను ఇలా పరిష్కరించవచ్చంటూ ప్రభుత్వానికి ఆయన సూచనలు ఇచ్చేవారు. ఆ యాత్రే ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న జగన్ ఇక ప్రజల మధ్యకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రావణమాసం మొదటివారంలో ప్రజాదర్బార్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు పూర్తయింది. 11 సీట్లను గెలుచుకున్న జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో అధికారపక్షంపై ఆదినుంచే యుద్ధం మొదలుపెట్టారు జగన్మోహన్‌రెడ్డి. ప్రతిపక్షనేత హోదాపై ఏకంగా కోర్టుకు వెళ్ళారు. అంతటితో ఆగకుండా ఏపీలో జరుగుతున్న దారుణాలపై ఢిల్లీలో ధర్నా నిర్వహించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే వైసీపీకి చెందిన 36 మంది కార్యకర్తలను హత్య చేశారని ఆధారాలతో సహా ఆరోపించిన జగన్.. జాతీయస్థాయిలో పలు పార్టీల మద్ధతును కూడగట్టారు.
ఢిల్లీ వేదికగా కూటమి వైఖరిని ఎండగట్టిన జగన్ ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వేళ్ళి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలకు వివరించనున్నారు. ఐదేళ్ళపాటు ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారికి మరింత దగ్గరవ్వడమే లక్ష్యంగా ప్రజాదర్బార్‌కు ఆయన సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో కేడర్ కూడా నిరుత్సాహానికి గురవుతోంది. ఇప్పుడు అధినేతే మళ్ళీ వస్తున్నాడని తెలుసుకుని కార్యకర్తలు సంబరపడుతున్నారు. ప్రజాదర్బార్‌లో అభిమాన నేతను కలిసేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.