జగన్ అతి జాగ్రత్తగా వ్యవహరిస్తూ పాలనకు సంబంధించి నిజాలు తెలుసుకునేందుకు ఐ ప్యాక్ తరఫున వేగులను నియమించారు. వాళ్లంతా క్షేత్ర స్థాయిలో తిరుగుతూ చడీ చప్పుడు కాకుండా ఎమ్మెల్యేల గుట్టు అంతా సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అవినీతి, ప్రజా సమస్యలపై స్పందించే తీరు ఇలా కీలక విషయాలపై ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్ తయారు అయిపోయింది. మన నేతలకు కూడా ఇప్పటికే వైసీపీ అధిష్టానం నుంచి ఇప్పటికే సీఎంఓ నుంచి ఫోన్లు వెళ్లాయని కూడా తెలుస్తోంది. ప్రొగ్రస్ రిపోర్ట్ తయారు కావడంతో పనితీరు కు సంబంధించి జీరో మార్కులు ఉన్నవారంతా రానున్న కాలంలో ఇళ్లకే పరిమితం కావడం ఖాయం. అందుకే చాలా మంది ఐ ప్యాక్ తరఫున పనిచేస్తుంది ఎవరు ? వారు సేకరించిన వివరాలు ఏమయి ఉంటాయి? అన్న వివరాలూ సేకరిస్తున్నారు.
ఈ నేపథ్యాన ఎలా అయినా గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సిద్ధం అవుతున్నారు వైసీపీ అధినేత జగన్. గతంలో కన్నా మెరుగైన పాలన అందించాం కనుక రాష్ట్రంలో అన్ని స్థానాలూ గెలుచుకుని రావాలని అంటున్నారు. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ పాయింట్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే ఆయన కొందరు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లను సీన్లోకి దింపారు. వారి కనుసన్నల్లోనే పార్టీ నడవనుంది.
ఇప్పటికే ఓ సారి క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించిన ఐ ప్యాక్, సంబంధిత సమాచారాన్ని సీఎం కు కూడా చేరవేసింది. వీటి ప్రకారమే ఎంఎల్ఏల పనితీరుకు సంబంధించి అంచనాలు, కూడికలు, తీసివేతలు కూడా జరిగిపోయాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు ఒక నెల (దాదాపు) పూర్తికావడంతో సీఎం సంబంధిత ఫలితాలపై ఆరాతీశారు. అయితే వీటి వివరాలను సేకరించి ఇవాళ విశ్లేషణ ఇచ్చింది కూడా ఐ ప్యాక్. అంటే చాపకింద నీరులా ఐ ప్యాక్ పనులు ఎప్పుడో ప్రారంభం అయి, ఇవాళ వాటి వివరాలు మాత్రమే అధికారికంగా వెల్లడి అయ్యాయి అన్నది నిజం.
వచ్చే ఎన్నికల్లో ఐ ప్యాక్ తోనే అంతా జరగనుంది. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరిట ప్రశాంత్ కిశోర్ నెలకొల్పిన ఈ సంస్థ ఇకపై కూడా కొన్ని వ్యూహాలు సిద్ధం చేయనుంది. రాష్ట్రంలో వై.ఎస్.జగన్ గెలుపే ధ్యేయంగా ఇకపై పనిచేయనుంది. కాన్పూర్ ఐఐటీలో చదువుకున్న రిషి రాజ్ సింగ్ ఇకపై ఇక్కడ పనిచేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా సిద్ధమైంది. ప్రశాంత్ కిశోర్ తరఫున ఆయన ఇక్కడ సేవలు నిర్వహించనున్నారు.
ఇప్పటికే ఆయన రంగంలోకి దిగిపోయారు. ఇవాళ్టి నుంచి ఐ ప్యాక్ సర్వీసులు అధికారికంగా కూడా షురూ అయిపోయాయి. ఇవాళ అమరావతిలో వర్క్ షాప్ నిర్వహించిన సంగతి తెలిసిందే! దీనిని కూడా నిర్వహించింది, ఈ సందర్భంగా ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది కూడా ఐ ప్యాక్ నే !