తండ్రులను మించిన కుమార్తెలు.. ఇంతకీ వారు ఎవరంటే…?

-

ఏపీ రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తులుగా చరిత్ర సృష్టించిన ఇద్దరు మహానేతలకు చెందిన కుమార్తెలు ఇప్పుడు రాజకీయంగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. వారి తండ్రులిద్దరూ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. తరాలు మారినా వారి రూపం తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరం. వారి కూతుళ్ళుగా వీళ్ళు కూడా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రస్తుతం రెండు జాతీయ పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు.

రాజకీయ సాధికారితను సాధించిన మహిళా నాయకులుగా జనం గుండెల్లో నిలచిపోనున్నారు. ఒకరు కమలదండుకి సారథ్యం వహిస్తుండగా మరొకరు హస్తం సైన్యానికి అధ్యక్షురాలిగా రానున్న ఎన్నికల్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. వారు మరెవరో కాదు భారతీయ జనతాపార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మరొకరు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోబోతున్న వైఎస్‌ షర్మిలారెడ్డి. ఈ ఇరువురు నేతల మథ్య అనేక సారూప్యాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలిగా 2023 జూన్‌లో ద‌గ్గుబాటి పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించారు.ఏపీలో మహిళా సాధికారితను నిజం చేస్తూ ఓ మహిళానేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు బీజేపీ హైకమాండ్‌. బాధ్యతలు స్వీకరించినంతనే పార్టీలో కేడర్‌ ఉత్సాహాన్ని నింపుతూ ఏపీ వ్యాప్తంగా పర్యటనలు చేసి నేతలను అలెర్ట్‌ చేశారు. మట్టి మాఫియా, మద్యం మాఫియాపై చెలరేగిపోయారు. సమాధానం ఇవ్వలేని అనేక ప్రశ్నలను ప్రభుత్వంపై సంధించారు. వైన్ షాప్‌ల‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతో బీజేపీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపారు. ఏపీలో బీజేపీ బలానికి పునాదులను పటిష్టపరిచే ప్రయత్నాల్లో పురంధేశ్వరి ఎక్కడా తగ్గడం లేదు.

ఎన్నికల నాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెల‌ల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన చరిత్ర నందమూరి తారక రామారావుది. అలాంటి మ‌హా నేత‌ తనయ పురంధేశ్వరి రాజకీయ రంగంలోనూ ధీటుగా రాణిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కేంద్రమంత్రిగా పనిచేశారు.అటు పార్టీలో కూడా కీలక పదవులను నిర్వర్తించారు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆరితేరారు.ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలోనూ చక్రం తిప్పుతున్నారు.

ఇక వైఎస్‌ షర్మిలారెడ్డి విషయానికి వస్తే ఈ నెల 21వ తేదీన పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నారామె. 2004లో తన పాదయాత్రతో కాంగ్రెస్‌కి తిరుగులేని విజయాన్ని అందించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. 2009లో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన తనయగా వైఎస్‌ షర్మిలారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్‌కి అనూహ్య రీతిలో ఏపీ పగ్గాలు చేప‌ట్టారు. పదేళ్లుగా ఏపీలో అడ్రస్‌ లేని స్థితిలో ఆంధ్రులకు దూరమైన కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఆమె బాధ్యతలను తీసుకున్నారు.ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు శ్రమించిన వైఎస్సార్‌ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని గౌరవం. ఏపీలో కాంగ్రెస్‌కు ఊపిరి పోయాలంటే షర్మిల వలనే అవుతుందని భావించిన ఏఐసీసీ ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఏపీలో కాంగ్రెస్‌కి 16వ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు తీసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన ఇద్దరు మాజీ సీఎంల కూతుళ్లు రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నారు. 1983 వరకూ ఉమ్మడి ఏపీలో అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో అడ్డుకట్ట వేశారు నందమూరి తారక రామారావు. పెత్తందారుల రాజకీయ చరిత్రకు చరమగీతం పాడారు.రాజకీయంగా అనేక మార్పులకు ఆద్యుడయ్యారు ఎన్టీఆర్‌. పార్టీలో మహిళలకూ పెద్ద పీట వేశారు. అటు జాతీయ రాజకీయాల్లోనూ తెలుగు జాతి ఆత్మగౌరవం చాటారు. అలాంటి నాయకుడి పుత్రిక పురందేశ్వరీ ఇప్పుడు జాతీయ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇక 1994 తరువాత ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నీరుగారి పోయింది. ఇలాంటి స్థితిలో తన సుధీర్ఘ పాదయాత్రతో జనంలోకి వెళ్లి, జనంతో మమేకమై, 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు దివంగత నేత వైఎస్సార్‌. 2009లోనూ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ నేతృత్వంలోనే అధికారంలోకి వచ్చింది.  ఆయన హఠాత్ మరణం, ఏపీ రాష్ట్ర విభజన, వంటి సంఘటనల నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికినే కోల్పోయింది. మళ్లీ పూర్వవైభవం సంతరించుకోవడానికి షర్మిలకు పట్టం కట్టారు కాంగ్రెస్‌ అగ్రనేతలు. ప్రస్తుతం కీలక బాధ్యతల్లో ఈ ఇరువురు మహిళా నేతలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version