రెండు తెలుగు రాష్ట్రాల్లో దివంగత వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆ వైఎస్సార్ ఇమేజ్‌ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు ఆయన వారసులు. ఇప్పటికే ఏపీలో వైఎస్ ఇమేజ్ జగన్‌కు బాగా కలిసొస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయిపోవడంతో, ఆ స్థానాన్ని జగన్ రీప్లేస్ చేశారు. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్‌కు షిఫ్ట్ అయింది. ఆ ఓటు బ్యాంకుతోనే 2014లో ప్రతిపక్షంలోకి రాగలిగారు. అలాగే 2019 ఎన్నికలకు మరింతగా ప్రజల మద్ధతు పొంది అధికారంలోకి వచ్చారు.
అయితే ఏపీలో సక్సెస్ అయిన వైసీపీ, తెలంగాణలో సక్సెస్ కాలేదు. దీంతో జగన్, తెలంగాణలో పార్టీని క్లోజ్ చేసేసి, కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. కానీ జగన్ సైడ్ అయినా, వైఎస్సార్ వారసురాలుగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఈమె వైసీపీ తరుపున రాష్ట్రం మొత్తం పాదయాత్ర సైతం చేశారు. ఇక ఆ అనుభవంతో తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి షర్మిల తిరుగుతున్నారు. త్వరలోనే పార్టీ పేరు ప్రకటించి ప్రజల్లోకి వెళ్లనున్నారు.
ఇప్పటికే షర్మిల తెలంగాణ ప్రజల సమస్యలపై గళం విప్పడం మొదలుపెట్టారు. కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్‌గా ఆమె విమర్శలు చేస్తున్నారు. అయితే షర్మిల టార్గెట్ కేసీఆర్ అయినా, నష్టం జరిగేది మాత్రం కాంగ్రెస్ పార్టీకే అని విశ్లేషణలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో షర్మిల ఏ మేర బలపడుతుందో చెప్పలేం. కానీ ఆమె వైఎస్సార్ అభిమానులు, రెడ్డి, దళితుల ఓట్లు లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా ఉంది. అయినా సరే ఆ పార్టీకి ఇంకా వైఎస్సార్ అభిమానులు, రెడ్డి, దళితుల ఓట్ల మద్ధతు ఎక్కువగా ఉంది. పైగా ఆ నాలుగు జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు డ్యామేజ్ జరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. చూడాలి మరి తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఏ మేర సత్తా చాటుతుందో?